ప్రభుత్వం అసలే పని చేయడం లేదని జగన్ విమర్శిస్తూ ఉండటం అనేది వైసీపీ పాలసీ. కానీ వైసీపీకి ఇటీవలి కాలంలో ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయాల్సి వస్తోంది. హంద్రీనీవా, కుప్పంకు జలాలు, గూగుల్ పెట్టుబడులు, బోగాపురం ఎయిర్ పోర్టు ఇలా ఎన్నో అంశాల్లో ప్రభుత్వ విజయాల నుప్రచారం చేస్తోంది. అయితే అవి మా కృషి అని చెప్పుకుంటోంది. ఎవరి కృషి అయినా సరే.. ప్రభుత్వం గొప్ప పనితీరు చూపిస్తోందని అంగీకరించాల్సి వస్తోంది.
పాపం జగన్.. ఇలాంటి పరిస్థితి ఊహించి ఉండరు..!
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వైసీపీకి వింత రాజకీయాలు చేయక తప్పడంలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదని, పాలన స్తంభించిందని ఒకపక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పిస్తుండగా.. అదే సమయంలో ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను తమవిగా ప్రచారం చేసుకోవడానికి వైసీపీ సోషల్ మీడియా, సాక్షి మీడియా తాపత్రయపడుతున్నాయి. అంటే, పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన ఫలితాలను సాధిస్తోందని వైసీపీ ఒప్పుకున్నట్లవుతోంది. కేవలం ఆ విజయాల వెనుక ఉన్న క్రెడిట్ ఎవరిది అనే దగ్గరే జగన్ రెడ్డి పేచీ పెడుతున్నారు. తన వల్లే అని చెప్పుకునేందుకు ముందుకు వస్తున్నారు.
అన్ని చోట్లా అదే గోల !
గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులతో ముందుకు రావడం, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు శరవేగంతో సాగడం, కుప్పం ప్రాంతానికి హంద్రీ-నీవా జలాలు చేరుకోవడం వంటి అంశాల్లో వైసీపీ వాదన విడ్డూరంగా ఉంది. ఈ ప్రాజెక్టులన్నీ తమ హయాంలోనే రూపుదిద్దుకున్నాయని, ఇప్పుడు కేవలం రిబ్బన్ కటింగ్ మాత్రమే జరుగుతోందని జగన్ వాదిస్తున్నారు. అయితే, గత ఐదేళ్లలో అడుగు ముందుకు పడని ఈ ప్రాజెక్టులు, ఇప్పుడు ఎలా పరుగులు పెడుతున్నాయనే ప్రశ్నకు మాత్రం వారి దగ్గర సమాధానం లేదు. ఫలితాలు వస్తున్నాయి కాబట్టే, ఆ విజయాల్లో వాటా కోరుతూ వైసీపీ ప్రచారం చేస్తోందనేది బహిరంగ రహస్యం.
ఒకవైపు ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రచారం చేస్తూనే, మరోవైపు ప్రభుత్వ విజయాలను మా పథకం – మా విజయం అని చెప్పుకోవడం వైసీపీ రాజకీయ అవసరంగా కనిపిస్తోంది. గూగుల్ పెట్టుబడి రాకపోయి ఉంటే జగన్ రెడ్డి విమర్శలు చేసేవారు, కానీ అది సాకారమైంది కాబట్టి ఇప్పుడు ఆ క్రెడిట్ కోసం పోటీ పడుతున్నారు. అంటే, ప్రభుత్వం పనితీరు బాగుందని, ఫలితాలు వస్తున్నాయని పరోక్షంగా జగన్ రెడ్డి సర్టిఫికేట్ ఇస్తున్నట్లే లెక్క. అభివృద్ధి జరగకపోతే దాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి వైసీపీ ఆరాటపడుతోంది.
వింత వింతగా వైసీపీ మీడియా,సోషల్ మీడియా ప్రచారం
వైసీపీ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు కూడా ఇదే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాల వల్ల వస్తున్న సానుకూల ఫలితాలను హైలైట్ చేస్తూనే, వాటికి జగన్ రెడ్డి పాత ఫైళ్లపై సంతకాలు చేశారని రంగు పులుముతున్నారు. ఈ క్రెడిట్ వార్ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం.. ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల పెరుగుతున్న సానుకూలతలో తాము కూడా వాటా పొందాలనుకోవడమే. కానీ, ప్రతి విజయానికి తమ ముద్ర ఉందని చెప్పుకోవడం ద్వారా, కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందనే నిజాన్ని వైసీపీ స్వయంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. జగన్ రెడ్డి అండ్ కో చేస్తున్న ఈ ప్రచారం ఒక సెల్ఫ్-గోల్లా మారుతోంది. ప్రభుత్వం పని చేయడం లేదని విమర్శిస్తూనే, ప్రభుత్వం సాధిస్తున్న ఘనతలను తమవిగా క్లెయిమ్ చేసుకోవడం ద్వారా.. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందనే విషయాన్ని వైసీపీ కార్యకర్తలే అంగీకరించాల్సి వస్తోంది.
జగన్ రెడ్డి ఏం చేసినా చింపి చేటంతవుతుందని ైసీపీ నేతలు చెప్పుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. కూటమి విజయాలకు జగన్ పరోక్షంగా గట్టి ప్రచారం చేస్తున్నారు.
