తెలంగాణకు బీఆర్ఎస్ జలద్రోహం చేసిందని.. జగన్ తో కలిసి కుమ్మక్కయి .. నీటి వాటాలకు నీళ్లొదిలేశారని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అదే నిజమని జగన్ కూడా చెబుతున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి, దాదాపు 80 నుండి 85 శాతం పనులు పూర్తి చేశామని జగన్ స్పష్టం చేశారు. అప్పట్లో పనులు శరవేగంగా సాగాయని గుర్తు చేశారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ తన హక్కులను కాపాడుకుందన్నారు.
అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టుపై నీలి నీడలు కమ్ముకున్నాయని జగన్ ఆరోపించారు. మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు అన్యాయం జరుగుతుందనే సాకుతో రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని, దానికి చంద్రబాబు నాయుడు మౌనంగా సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. సాగర్ కుడి కాలువ యంత్రణను కూడా తెలంగాణకు వదిలేశారని, దీనివల్ల ఏపీ రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఉన్నప్పుడు పోలీసుల్ని పంపి తాము అధీనంలోకి తీసుకున్నామన్నారు.
కేసీఆర్ హయాంలో లేని విధంగా ఇప్పుడు ఏపీ తన నీటి హక్కులను కోల్పోతోందని జగన్ తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా బీఆర్ఎస్ తెలంగాణకు జలద్రోహం చేసిందని.. తనకు సహకరించిందని జగన్ చెప్పినట్లయింది. రేవంత్ రెడ్డి కూడా ఇదే ఆరోపిస్తున్నారు. అయితే రాయలసీమ లిఫ్ట్ జగన్ సీఎంగా ఉన్నప్పుడే తాము ఎన్జీటీలో పిటిషన్లు వేసి ఆపేశామని హరీష్ రావు ప్రకటించారు.
