కోటరీ గుప్పిట్లో ఉన్న జగన్ అనే విమర్శ చాలా కాలంగా వైసీపీలో ఉంది. అధికారం పోయాక అది మరీ తీవ్రమయింది. ఇప్పుడు ఆయన మారేందుకు.. కోటరీని దూరం పెట్టి అంతా తానై వ్యవహరించేందుకు రెడీ అవుతున్నారన్న సూచనలుకనిపిస్తున్నాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు, ఆయన ప్రసంగం ఒక కొత్త సంకేతాన్ని పంపాయి. పేపర్ లేకుండానే స్పీచ్ చదివారు. కోటరీలో ఉన్నారని చెప్పుకునే వాళ్లెవరూ పక్కన లేరు.
కోటరీని మెల్లగా దూరం పెడుతున్నారా?
చాలా కాలం తర్వాత జగన్ ఎటువంటి స్క్రిప్ట్ లేకుండా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా వేదికల మీద ముందుగా రాసుకున్న ప్రసంగ పాఠాలను చూసి చదివే జగన్, ఈసారి తన మనసులోని మాటను నేరుగా కార్యకర్తలతో పంచుకున్నారు. ఈ మార్పు కేవలం ప్రసంగానికే పరిమితం కాలేదు. పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి కీలక నేతలు ఎవరూ కనిపించలేదు. ఇన్నాళ్లూ పార్టీలో ఏ నిర్ణయమైనా ఈ ఇద్దరి కనుసన్నల్లోనే జరుగుతుందనే భావన క్యాడర్లో బలంగా ఉంది. అయితే, వేదికపై వారి గైర్హాజరీ ద్వారా.. పార్టీ పగ్గాలు మళ్ళీ తన చేతుల్లోకే వచ్చాయని జగన్ పరోక్షంగా చెప్పకనే చెప్పారు.
ఇక అన్నీ తన నిర్ణయాలే?
అధికారంలో ఉన్నప్పుడు..పోయిన తరవాత కూడా జగన్ చుట్టూ ఒక అభేద్యమైన గోడ ఏర్పడిందని, ఆ గోడను దాటి ఏ సమాచారం ఆయన వద్దకు వెళ్లేది కాదని అందరికీ తెలుసు. సలహాదారులుగా ఉన్నవారు ఇచ్చే స్క్రిప్టులు, వారు చేసే ఫిల్టరింగ్ వల్ల జగన్‌కు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియలేదనేది వైసీపీ క్యాడర్ ఆవేదన. ఇప్పుడు ఆ సలహాదారులను దూరం పెట్టి, కేవలం సమాచారం ఇచ్చేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని మాత్రమే పరిమితం చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే, వ్యూహం తనది.. డేటా టీమ్‌ది అన్నట్లుగా కొత్త పంథాను అనుసరించబోతున్నారని చెబుతున్నారు.
నిజంగా కోటరీ నుంచి బయటకు వస్తే క్యాడర్ కు సంతోషమే
ఒకవేళ జగన్ నిజంగానే ఈ కోటరీ నుంచి బయటకు వస్తే, అది వైసీపీ శ్రేణులకు పెద్ద ఊరటనిస్తుంది. ఎందుకంటే, పార్టీ కోసం కష్టపడే సాధారణ కార్యకర్తకు, నాయకుడికి మధ్య ఉన్న గ్యాప్ తగ్గడానికి ఇది దోహదపడుతుంది. నేరుగా నాయకుడే అందుబాటులోకి వస్తారనే నమ్మకం కలిగితే క్యాడర్లో మళ్ళీ కొత్త ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది. అయితే, రాజకీయంలో ఇన్నాళ్లూ అలవాటు పడిన ఒక వ్యవస్థను రాత్రికి రాత్రే మార్చడం సాధ్యమేనా అన్నది అసలు సమస్య. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, సలహాదారుల ప్రభావం తగ్గించుకోవడం అనేవి వినడానికి బాగున్నప్పటికీ, ఆచరణలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. ముఖ్యంగా జగన్ వంటి నాయకుడు ఇన్నాళ్లూ డిపెండ్ అయిన నెట్‌వర్క్‌ను కాదని, కొత్తగా పార్టీని నడపాలంటే క్షేత్రస్థాయిలో ప్రక్షాళన చేయాల్సి ఉంటుంది. కవేళ ఆయన మళ్ళీ పాత పద్ధతిలోనే వెళ్తే మాత్రం, అది పార్టీకి మరింత నష్టం చేకూర్చే ప్రమాదం ఉంటుంది.


