ఇష్టం లేకపోయినా రాజకీయాల కోసం హిందూ కార్యక్రమాల్లో పాల్గొంటే ఎలా ఉంటుందో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని చూస్తే అర్థమైపోతుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పులివెందుల పట్టణంలోని భాకరాపురంలో నూతనంగా నిర్మించిన నందీశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతున్న తరుణంలో, జగన్ ఆలయ సందర్శన , అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
ఆలయ ప్రాంగణంలో జరిగిన హోమ క్రతువులో జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అయితే, ఈ సందర్భంగా జరిగిన ఒక సంఘటన చర్చనీయాంశమైంది. శాస్త్రోక్తంగా హోమగుండంలో వేయాలని పూజారి కొన్ని ద్రవ్యాలను జగన్ చేతికి అందించారు. అయితే ఆయన కేవలం ఒక్కసారి మాత్రమే వాటిని హోమగుండంలో విసిరారు. ఆ తర్వాత పూజారి మంత్రాలు చదువుతూ మరికొన్ని పదార్థాలను ఇవ్వబోగా, జగన్ వాటిని హోమగుండంలో వేయకుండా నేరుగా పూజారి చేతుల్లోనే పోశారు. దీంతో సదరు పూజారి స్వయంగా వాటిని హోమగుండంలో వేయాల్సి వచ్చింది.
ఈ పూజా విధానంపై సోషల్ మీడియాలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తిరుమల నెయ్యి కల్తీ వివాదం కారణంగా జగన్ హిందూ సంప్రదాయాలను పాటించే తీరుపై విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా ఆయన ఆలయ సందర్శనల సమయంలో అన్యమతస్తుల డిక్లరేషన్ ఇవ్వలేదన్న ఆరోపణలు ఉండగా, ఇప్పుడు హోమగుండం వద్ద ఆయన వ్యవహరించిన తీరుపై వివాదం జరిగే అవకాశాలు ఉన్నాయి.
