“నాకు ఫోనే లేదు”.. అని జగన్ రెడ్డి ఓ టీవీ ఇంటర్యూలో చెప్పడం ట్రోలింగ్‌కు గురయింది. కానీ ఇప్పుడు సీబీఐ కోర్టుకు కూడా అదే చెబుతున్నారు. జగన్ రెడ్డికి వ్యక్తిగత ఫోన్ నెంబర్ లేదని.. సిబ్బంది ఫోన్లను వాడుతారని.. ఆయన వారు కోర్టుకు చెప్పారు. గతంలోనూ జగన్ సొంత ఫోన్ నెంబర్ ఇవ్వలేదని.. పక్కనోళ్ల నెంబర్లు ఇచ్చి విదేశీ పర్యటనకు వెళ్లారని కోర్టుకు ఆయన తరపు లాయర్ తెలిపారు. ఈ వాదనతో కోర్టు ఎలా స్పందిస్తుందో తర్వాత విషయం కానీ.. అసలు జగన్ రెడ్డి ఎవర్ని మోసం చేయాలనుకుంటున్నారు? ఇంత అమాయకంగా ఎలా ఉంటారు? అన్న సందేహాలు అందరికీ వస్తున్నాయి.
ఫ్యామిలీతో టచ్ లో ఉండటానికి కూడా వేరే వాళ్ల నెంబర్లే వాడతారా?
కాస్త వాస్తవంగా ఆలోచిస్తే అది అసాధ్యం అనుకోవచ్చు. ఓ మాదిరి వ్యాపారం చేసేవారే .. రెండు, మూడు ఫోన్లను ఉపయోగిస్తూ పనులు చక్కబెట్టాల్సి ఉంటుంది. అలాంటిది రాజకీయ పార్టీని నడుపుతున్న ఆయనకు ఫోన్ ఉండదా ?. సరే ఆయన పనులన్నీ వ్యక్తిగత సిబ్బంది ఫోన్ల ద్వారా చక్కబెడతారు అనుకుందాం. మరి కుటుంబసభ్యులు ఫోన్లు చేయాలన్నా.. మాట్లాడాలన్నా.. వ్యక్తిగత సిబ్బందికే ఫోన్ చేస్తారా ?. లండన్ లో ఉండే కుమార్తెలు తండ్రితో మాట్లాడాలనుకుంటే.. ఓ వాట్సాప్ మెసెజ్ చేయాలనుకుంటే అవకాశం ఉండదా ?
ఫోన్ నెంబర్లూ బినామీనే !
జగన్ రెడ్డి ఆస్తులన్నీ ఆయన పేరు మీద ఉండవు. సూట్ కేసు కంపెనీల పేరు మీద ఉంటాయి. చివరికి నివాసం ఉండే ఇళ్లు కూడా ఇలా కంపెనీల పేరు మీద పెట్టి ఆ కంపెనీల షేర్లు మాత్రమే ఆయన పేరు మీద ఉంటాయి. ఆ ఇల్లు వంద కోట్లు ఉంటే..ఆ కంపెనీ విలువ లక్ష ఉంటుంది. ఇలాంటి విన్యాసాలతో ఆయన బినామీ ఆస్తులతోనే టైంపాస్ చేస్తున్నారు. చివరికి అదే ఫార్ములా ఫోన్ నెంబర్ వ్యవహారంలోనూ పాటిస్తున్నారు. తాను వాడే ఫోన్ నెంబర్.. ఇతరుల పేర్లపై ఉంటుంది. అదే ఆయన వాడుతారని అర్థం.
కోర్టుల్నీ మోసం చేయడమే నైజం !
విదేశాలకు వెళ్లేందుకు అనుమతి పొందిన ఆయన.. కోర్టు షరతులు పాటిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి సీబీఐ అధికారులు ప్రయత్నిస్తారు. కానీ ఆయన యూరప్ వెళ్లారు. కానీ ట్రాక్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఆయన ఇచ్చిన ఫోన్ నెంబర్ కు.. అందుబాటులోకి రాలేదు. అందుకే కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానికి జగన్ రెడ్డి లాయర్లు.. సీబీఐకి రాజకీయం అంట గడుతున్నారు. రాజకీయం కోసమే ఇలాంటి పిటిషన్ వేశారని అంటున్నారు. సీబీఐ రాజకీయం చేయాలనుకుంటే.. జగన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం పెద్ద విషయం కాదేమో. ఇన్ని ఆరోపణలు చేస్తున్నా.. సీబీఐ ఎప్పుడో ఓ సారి ఏదో తెలిసీ తెలియనట్లుగా.. ఎందుకు చర్యలు తీసుకుంటుందో వారికే తెలియాలి.