ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారి అని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అరెస్ట్ తర్వాత వాట్ నెక్ట్స్ అంటూ వైసీపీ లెక్కలు వేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అందరి లెక్కా తెలుస్తానని ఓ వైపు విజయసాయిరెడ్డి బెదిరింపులు , మరోవైపు రాజ్ కసిరెడ్డి అరెస్టుతో టెన్షన్ పడిపోతున్న వైసీపీ..ఈ కేసులో నెక్స్ట్ మిథున్ రెడ్డి వికెట్ పడుతుందా? అని ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
మంగళవారం పీఏసీ సమావేశంలో వైసీపీ అధినేత జగన్ పాల్గొని .. లిక్కర్ స్కామ్ కేసులో నెక్స్ట్ మిథున్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారని సంకేతాలు పంపారు. మిథున్ ని టార్గెట్ చేశారని జగన్ చెప్పడం చూస్తుంటే.. మానసికంగా ఆయన్ని అరెస్టుకు సిద్దపడాలని ప్రిపేర్ చేస్తున్నట్టు ఉందంటున్నారు.
ఈ కేసులో రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విజయసాయిరెడ్డిని ఇదివరకే ప్రశ్నించగా.. రెండు సార్లు లిక్కర్ పాలసీపై తన నివాసంలో జరిగిన చర్చల్లో మిథున్ రెడ్డి పాల్గొన్నారని చెప్పారు. విజయసాయి రెడ్డి చెప్పిన సమాధానాల ఆధారంగా మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించగా.. తనకు ఏమి తెలియదని, గుర్తు లేదని సమాధానాలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.
ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ భయంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మిథున్ రెడ్డి..ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ పూర్తి కాగానే సిట్ ఆయన్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉండటంతో.. నెక్స్ట్ మిథున్ రెడ్డి అరెస్ట్ ఖాయమని ఆయనను మానసికంగా సన్నద్ధం చేస్తున్నారని జగన్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో స్పష్టం అవుతోంది.