వైకాపాని ప్రజలకి చెరువు చేయాలనే ఉద్దేశ్యంతో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గత నెల ‘గడప గడపకి వైకాపా’ అనే ఒక కార్యక్రమం ప్రారంభించారు. దానిపై జరిపిన సమీక్ష సమావేశంలో దానిని సీరియస్ గా తీసుకోనందుకు పార్టీ నేతలపై జగన్ చాలా సీరియస్ అయినట్లు ఇటీవల సాక్షి మీడియాలో చేరిన కొమ్మినేని తన వెబ్ సైట్ లో పేర్కొన్నారు.
ఆ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు అందరూ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికలు వైకాపాకి ఎంత కీలకమైనవో వారికి వివరించి, ఇప్పటి నుంచే అందుకు పార్టీని సిద్దం చేయడానికి అందరూ గట్టిగా కృషి చేయాలని జగన్ వారిని గట్టిగా కోరారు. ప్రజలకి మరింత చేరువయ్యేందుకు తాను ‘గడప గడపకి వైకాపా’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే, దానిని నేతలు ఎవరూ సీరియస్ గా తీసుకోలేదని జగన్మోహన్ రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కొమ్మినేని పేర్కొన్నారు.
గడప గడపకి వైకాపా కార్యక్రమానికి మంచి ప్రజాధారణ వస్తోందని కనుక ఇప్పటికైనా పార్టీ నేతలు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గట్టిగా ప్రయత్నించాలని పార్టీ నేతలని జగన్ ఆదేశించారు. ఒకవేళ వారు ఇదే విధంగా వ్యవహరిస్తే వారిని పదవులలో తప్పించి వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తానని హెచ్చరించినట్లు కొమ్మినేని పేర్కొన్నారు.
ప్రజలకి చేరువడానికి అది చాలా మంచి కార్యక్రమమే కానీ దానిని అమలుచేయడానికి చాల వ్యయప్రయాసలు భరించాల్సి ఉంటుంది. పైగా పార్టీలో కాస్త పెద్ద నేతలు ఇంటింటికీ తిరగడం సాధ్యం కాదు. వారి కష్టాలు, సమస్యలు లేదా ఇబ్బందులు వారికీ ఉంటాయి. కనుక చివరికి ఆ బాధ్యత, భారం అంతా సామాన్య కార్యకర్తలపైనే పడుతుంది. దానిని భరించడం వారికీ కష్టమే. ఏదో ఒకరోజు బహిరంగ సభో, బందో, ధర్నాలో నిర్వహించడం ఎవరికీ పెద్ద కష్టమేమీ కాదు. కానీ రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్య కార్యకర్తలకి నెలల తరబడి సాగే ఇటువంటి కార్యక్రమాలని అమలుచేయాలంటే సాధ్యం కాదు.
పార్టీలో నాయకులకి, కార్యకర్తలకి ఉండే ఇటువంటి ఇబ్బందులను పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లేకుంటే బయటకి గెంటేస్తానని హుకుం జారీ చేస్తే చివరికి పార్టీలో ఆయనే ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది.
సైన్యాధ్యక్షుడు తన సైన్యంలో పోరాటస్ఫూర్తి నింపే ప్రయత్నాలు తప్పకుండా చేయాలి. కానీ అదే సమయంలో వారి సమస్యలని కూడా పరిగణనలోకి తీసుకొని ముందుకు సాగడం చాలా అవసరం. సైన్యాధ్యక్షుడికి పోరాడాలనే తపన ఉంటే సరిపోదు వెనుకనున్న సైన్యంలో కూడా ఆ తపన ఉన్నప్పుడే విజయం సాధించగలరని గ్రహిస్తే మంచిది.
వచ్చే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి ఎంత ముఖ్యమైనవో చంద్రబాబు నాయుడికి కూడా అంతకంటే ముఖ్యమైనవే. వచ్చే ఎన్నికలలో మళ్ళీ గెలిచి అధికారం చేజిక్కించుకొంటేనే నారా లోకేష్ రాజకీయ భవిష్యత్ గాడిన పడుతుంది. లేకుంటే రాహుల్ గాంధీలాగే అయోమయంగా తయారవుతుంది కనుక 2019 ఎన్నికలలో గెలిచి అధికారం నిలబెట్టుకొనేందుకు తెదేపా కూడా చాలా గట్టిగానే ప్రయత్నిస్తుంది. అది కూడా జగన్ గుర్తుంచుకొని, తదనుగుణంగా ప్రణాళికలు, వ్యూహాలు రచించించుకొని ముందుకు సాగడం మంచిది.