ఈ మధ్య నవరత్నాల గురించి పెద్దగా మాట్లాడటం లేదు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి. ఎంతసేపూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అవినీతి ఆరోపణలే చేస్తున్నారు. చంద్రబాబుపై విమర్శలనే వైకాపా ప్రధాన ప్రచారస్త్రంగా మార్చుకున్నారు. కానీ, ఇప్పుడు మళ్లీ నవరత్నాల గురించి జగన్ మాట్లాడారు. విశాఖలో పార్టీ శ్రేణులతో సమావేశం సందర్భంగా జగన్ ప్రసంగిస్తూ… వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఎదుర్కోవాలంటే నవరత్నాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు!
ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు డబ్బులు విపరీతంగా వెదజల్లుతారు, తమ దగ్గర అంత సొమ్ములేదని ప్రజలకు చెప్పాలన్నారు జగన్. చంద్రబాబు ఇచ్చే చిల్లరకన్నా, వైసీపీ అధికారంలోకి వస్తే అంతకంటే వంద రెట్లు ఎక్కువగా ప్రయోజనం ఉంటుందని ప్రజలు నమ్మాలన్నారు! అలా చేస్తేనే టీడీపీకి కాదని ప్రజలు వైకాపాకి ఓటేస్తారని జగన్ చెప్పారు. నవరత్నాల ద్వారా ప్రతీ కుటుంబానికీ లక్షల్లో లాభం ఉంటుందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. నవరత్నాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో ప్రజలకు వివరించడం కోసం కొన్ని బ్రోచర్లను ఈ సందర్భంగా జగన్ విడుదల చేశారు.
నవరత్నాల గురించి జగన్ మాట్లాడుతున్నంతసేపూ ‘ప్రజా సంక్షేమం’ అనే మాట వినిపించకపోవడం గమనించాలి. చంద్రబాబు డబ్బులిస్తారు, అంతకుమించిన ప్రయోజనాలు మనం చేకూరుస్తామని ప్రజలు నమ్మేలా చెయ్యాలి… జగన్ మాట్లాడింది ఇదే! అంటే, నవరత్నాల ద్వారా ప్రజలకు ఎర వెయ్యాలన్నదే జగన్ పిలుపు! ఎన్నికలను కేవలం లాభం అనే కోణం నుంచి మాత్రమే ప్రజలు చూస్తారనేది జగన్ అభిప్రాయంగా ఉన్నట్టుంది. తమకు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారనే యాంగిల్ లోనే ప్రజలు ఆలోచించి ఓట్లేస్తారనే విశ్లేషణలో జగన్ ఉన్నారనడానికి ఇంతకంటే ఇంకేం కావాలి! చంద్రబాబు ఇప్పుడు వంద ఇస్తే… తాను అధికారంలోకి వస్తే లక్ష ఇస్తా అనే డీల్ మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తోంది.
అధికారంపై కేవలం వ్యామోహం ఉంటే… ఇలానే ప్రజలంటే ఓటర్లుగా మాత్రమే కనిపిస్తారు. అధికారం అనేది ఒక గురుతర బాధ్యతగా కనిపిస్తే… ప్రజా సంక్షేమం అనేది కనిపిస్తుంది. దాని కోసం ఏం చెయ్యగలమని ప్రజలకు వివరించాలన్న ఆలోచన వస్తుంది. పార్టీల నుంచి తక్షణ ప్రయోజనాలు, లాభాలు మాత్రమే ఆలోచించి ప్రజలు ఓట్లేస్తారన్న ధోరణి ఏమాత్రమూ సరికాదు. ప్రస్తుతం ఆంధ్రా ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా కావాలి, అన్ని రకాలుగా వెనకబడ్డ రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వం కావాలి. ప్రజలు ఇలా ఆలోచిస్తారనే అవగాహన వైకాపాకి ఉందా లేదా అనేది పార్టీ శ్రేణులకు జగన్ ఇచ్చిన పిలుపులోనే అర్థమౌతోంది!