వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం తన రాజకీయ ప్రస్థానంలో అత్యంత కీలకమైన వ్యూహకర్తల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, పార్టీని గాడిలో పెట్టేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం లేదు. 2019లో అఖండ విజయానికి కారకుడైన ప్రశాంత్ కిషోర్‌ను దూరం చేసుకున్న ఐప్యాక్ పై భారం వేసిన జగన్, ఫలితాల తర్వాత వారిని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఎన్నికలకు ముందు ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి మనం సుదీర్ఘ కాలం కలిసి ప్రయాణం చేద్దాం అని చెప్పిన జగన్, ఫలితాల షాక్‌తో నిర్ణయాన్ని మార్చుకున్నరాు.
వరుసగా మారుతున్న వ్యూహకర్తలు
ఐప్యాక్ నిష్క్రమణ తర్వాత వైసీపీ శిబిరంలో పలువురు వ్యూహకర్తల పేర్లు వినిపించాయి. ముఖ్యంగా బీజేపీ కోసం పనిచేసిన అనుభవం ఉన్న శంతను సింగ్ వంటి వారిని లైన్లోకి తెచ్చినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత మరికొందరు జాతీయ స్థాయి కన్సల్టెంట్లను సంప్రదించినా, జగన్ తీరు , ఆయన ఆలోచనా విధానానికి అనుగుణంగా ఎవరూ ఇమడలేకపోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. తాజాగా ఈషా సింగ్ అనే యువ వ్యూహకర్త పేరు తెరపైకి వచ్చింది. ఈమె గతంలో పలువురు ప్రముఖులకు సోషల్ మీడియా, పొలిటికల్ బ్రాండింగ్ విభాగాల్లో పనిచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె నేతృత్వంలో వైసీపీకి కొత్త ఇమేజ్ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.
జగన్ మనస్తత్వం.. వ్యూహకర్తల సవాల్
జగన్ మోహన్ రెడ్డి మనస్తత్వం ప్రకారం ఆయన ఒకసారి నమ్మితే పూర్తి బాధ్యతలు అప్పగిస్తారు, కానీ ఆశించిన ఫలితాలు రాకపోతే అంతే వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆయనకు కేవలం డేటా మాత్రమే కాదు, తన వ్యక్తిత్వాన్ని , క్షేత్రస్థాయి క్యాడర్ భావోద్వేగాలను ప్రతిబింబించే వ్యూహాలు కావాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యూహకర్తలు కేవలం సోషల్ మీడియా మేనేజ్మెంట్కు పరిమితమవుతున్నారే తప్ప, ప్రత్యర్థి కూటమిని ఢీకొట్టే బలమైన రాజకీయ అజెండాను సృష్టించడంలో విఫలమవుతున్నారనే అభిప్రాయం ఉంది.
మళ్ళీ పీకే వైపు చూపు?
ప్రస్తుత గందరగోళ పరిస్థితుల్లో, కొత్తవారు ఎవరూ నిలదొక్కుకోలేకపోతుండటంతో.. వైసీపీ చివరకు తన పాత మిత్రుడు ప్రశాంత్ కిషోర్ వైపే మళ్ళీ మొగ్గు చూపే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పట్లో పీకే ఇచ్చిన క్షేత్రస్థాయి రిపోర్టులు, అభ్యర్థుల ఎంపికలో ఆయన సలహాలు జగన్‌కు బాగా కలిసి వచ్చాయి. ఒకవేళ కొత్త టీమ్‌లు ఆశించిన స్థాయిలో పార్టీని పుంజుకునేలా చేయలేకపోతే, రాబోయే రోజుల్లో మిషన్ 2029 కోసం జగన్ మళ్ళీ పీకే శిబిరాన్ని ఆశ్రయించినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. అయితే పీకే ఆసక్తి చూపిస్తారా అన్నది మాత్రం చెప్పడం కష్టమే.


