ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్ప పాదయాత్ర 27వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పాదయాత్ర సాగుతోంది. మంగళవారం నాడు పెదవడుగూరు వద్ద నిర్వహించిన సభలో జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా నాలుగేళ్ల తెలుగుదేశం పాలనపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలుగా అవినీతి చూస్తున్నామన్నారు. ఈ అవినీతి చంద్రబాబు నాయుడు స్థాయి నుంచీ గ్రామ గ్రామాలకూ విస్తరించి ఉందన్నారు. ప్రతీ గ్రామంలో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాలు తయారు చేశారని ఆరోపించారు. పెన్షన్లు కావాలన్నీ, బియ్యాలు కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు ఇవ్వపోతే పని కావడం లేదన్నారు.
నాలుగేళ్ల ఆయన పాలనను చూశామనీ, ఒక్కసారి నాలుగేళ్ల కిందటికి అందరూ వెళ్లండంటూ ప్రజలను కోరారు. టీడీపీ అధికారంలోకి రాగానే కరెంటు బిల్లులు తగ్గిస్తామని ఇదే పెద్దమని నాలుగేళ్ల కిందట హామీ ఇచ్చారన్నారు. ‘ఇవాళ్ల కరెంటు బిల్లు ఎంత వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతా ఉన్నా? వెయ్యి రూపాయలా, ఆరు వందలా ఏడు వందలా ఐదు వందలా’ అంటూ ఆయనే ప్రజలకు ఆప్షన్లు ఇచ్చారు. ‘నాలుగేళ్ల కిందట ఇదే పెద్దమని చంద్రబాబు ఏమన్నాడూ… ప్రతీ పేదవాడికీ ఇంటి స్థలం, ఇల్లు కట్టిస్తానని అన్నాడా లేదా, అన్నాడా లేదా’ అంటూ ప్రజలను ప్రశ్నించారు. కానీ, ఇళ్లు ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారన్నారు. నాలుగేళ్ల కిందట బియ్యం కావాలంటే రేషన్ షాపులకు ప్రజలు వెళ్లేవారనీ, నాలుగేళ్ల తరువాత ఇప్పుడా పరిస్థితి ఉందా అని ప్రజలను ప్రశ్నించారు.
ఈ మధ్య జగన్ ప్రసంగాల్లో ఈ ‘నాలుగేళ్లు’ అనే టాపిక్ ఎక్కువగా వినిపిస్తోంది. నాలుగేళ్ల కిందట అలా ఉండేదీ, ఇప్పుడు లేదు! నాలుగేళ్ల కిందట చంద్రబాబు హామీలు ఇచ్చారు… ఇప్పుడు మోసం చేశారు. ఇలా ప్రతీదానికీ నాలుగేళ్ల కిందటి పరిస్థితితో ప్రస్తుతాన్ని పోల్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ క్రమంలో వైకాపా వ్యూహకర్తలు మిస్ అవుతున్న ఓ కీలక అంశం ఉంది. గడచిన నాలుగేళ్లుగా కరెంటు ఛార్జీలు పెరిగి, ప్రజలకు భారమౌతూ ఉంటే.. వైకాపా ఎందుకు మౌనంగా ఉంది..? నాలుగేళ్లుగా పేదలకు చంద్రబాబు సర్కారు ఇళ్లు కట్టించకపోతే.. వైకాపా ఎందుకు ఉద్యమించలేదు..? గత నాలుగేళ్లుగా రేషన్ షాపుల్లో సరుకులేవీ ప్రజలకు అందుబాటు లేకపోతే.. వైకాపా ఎందుకు ప్రశ్నించలేదు..? ముఖ్యమంత్రి స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ అవినీతి పెరిగిపోతే.. గత నాలుగేళ్లుగా వైకాపా ఎందుకు పోరాడలేదు..? ఈ నాలుగేళ్లుగా వైకాపా కూడా ప్రతిపక్ష పార్టీగా ఉంది కదా! వారు పోషించాల్సిన పాత్ర ఏదో ఒకటి ఉంటుంది కదా. దాని గురించి జగన్ ఎందుకు మాట్లాడటం లేదు..? నాలుగేళ్ల కిందటి పరిస్థితిని ఇప్పటితో పోల్చుతున్నప్పుడు… మధ్యలో ఉన్న ఈ నాలుగేళ్లూ వైకాపా ఏం చేసిందనే ప్రశ్నకు జగనే ఆస్కారం ఇస్తున్నారు. ప్రతీ ప్రజా సమస్యకూ ఎన్నికల ద్వారా మాత్రమే పరిష్కారం లభిస్తుందని వైకాపా భావిస్తున్నట్టుగా ఉంది! అందుకే, గడచిన నాలుగేళ్లలో ప్రజల పక్షాన పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీగా ఏం చేశారో చెప్పలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎన్నికలు దగ్గరపడ్డాయి కాబట్టే, ఇప్పుడు ఇలా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారనీ చెప్పుకోవచ్చు.