వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహాల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో ఇంటికే పరిమితమై .. తప్పనిసరి అయితే సెట్టింగులు వేయించే ఆయన ఇప్పుడు నేరుగా ఆలయాల బాట పట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తిరుమల లడ్డూ కల్తీ అంశం తెరపైకి వచ్చిన తర్వాత, తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు జగన్ ఈ కవర్ డ్రైవ్ ప్లాన్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన హిందూ వ్యతిరేక ముద్రను చెరిపేసుకునే క్రమంలో భాగంగానే కొత్తగా నిర్మించిన ఆలయాల ప్రారంభోత్సవాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ వ్యూహంలో భాగంగానే జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో పర్యటన ఖరారు చేసుకున్నారు. మంగళ సాయంత్రం 4 గంటలకు ఆయన పులివెందులకు చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం 9:30 గంటలకు వేంపల్లి మండలం నందిపల్లి గ్రామానికి వెళ్లి, అక్కడ నూతనంగా నిర్మించిన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొంటారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమంలో సమయం గడపనున్నారు.
ఈ వారం జగన్ షెడ్యూల్ అంతా పులివెందుల, బెంగళూరు చుట్టూనే తిరుగుతోంది. రాజధాని అమరావతి ప్రాంతానికి రాకుండా, కేవలం తన నియోజకవర్గ పర్యటన ముగించుకుని 26వ తేదీ ఉదయం నేరుగా బెంగళూరుకు వెళ్లనున్నారు. ఒకవైపు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నా, జగన్ మాత్రం తన నియోజకవర్గంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
