ఆంధ్రప్రదేశ్లో జగన్ వర్కింగ్ డేస్ వారానికి మూడు రోజులు. అందులో ఒక రోజు రావడానికి.. మరో రోజు పోవడానికి పోతే.. మగిలేది ఒక్క రోజు. ప్రతి వారం బుధవారం వస్తారు.. శుక్రవారం రిటర్న్ అవుతారు. ఏం జరిగినా.. సరే ఈ షెడ్యూల్ లో మార్పు రాదు. ఆయన బుధవారం వచ్చేలా ఓ కార్యక్రమం హడావుడి చేయడానికి ప్లాన్ చేస్తారు. ఈ సారి అంబటి బూతులు అంతే.
జైలుకెళ్లి రాంబాబును ఓదార్చువచ్చుగా.. గుంటూరులో ర్యాలీ ఎందుకు?
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగి నాలుగు రోజులు, ఆయన జైలుకు వెళ్లి మూడు రోజులు గడుస్తున్నా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన బెంగళూరు క్యాంప్ లోనే ఉన్నారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలతో అంబటి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉండగా, జగన్ మాత్రం తన పాత పద్ధతిలోనే కేవలం ట్విట్టర్ వేదికగా ఖండనలు తెలుపుతూ సరిపెట్టారు. ఇప్పుడు నేరుగా జైలుకే వెళ్లి అంబటి రాంబాబును ఓదార్చవచ్చు కానీ ఆయన గుంటూరులో ర్యాలీ చేయాలనుకుంటున్నారు. గతంలో లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఇతర నేతల విషయంలోనూ జగన్ ఇలాంటి ధోరణిని అవలంబించారు. వారిని కనీసం జైలుకెళ్లి పరామర్శించిన పాపాన పోలేదు.
ఏపీకి వచ్చినప్పుడల్లా షో చేయడమే పని!
బెంగళూరులోనే నివాసం ఉంటున్న జగన్ ఏపీకి వచ్చే రెండు రోజుల్లో ఒక రోజు షో చేస్తారు. అంబటిని నేరుగా జైలుకు వెళ్లి పరామర్శించకుండా, కేవలం ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడం ఎందుకంటే ర్యాలీ చేయడమే. జగన్ రెడ్డికి ఆయన వ్యూహకర్తలకు ఓ పిచ్చి ఉంది. అదేమిటంటే.. జగన్ రెడ్డి బయటకు వస్తే ఆయన కోసం జనం వస్తారని ప్రచారం చేయడం. ముందస్తుగా జన సమీకరణ చేసి.. కెమెరాలతో కనికట్టు చేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారు. నిజానికి ఆయన బయటకు వెళ్తే ఎంత మంది వస్తారో అందరికీ తెలుసు.
ఇంకా రెచ్చగొట్టాలనేదే జగన్ ఇవ్వబోయే సందేశం
పార్టీ నేతలు బూతులు, దాడులతో టీడీపీపై విరుచుకుపడితేనే జగన్ మెప్పు పొందుతారని వైసీపీ ఈ ర్యాలీతో సందేశం ఇవ్వనుంది. తమ వికృతానికి నేతలు జైలుకు వెళ్లినప్పుడు వారి వెంటే ఉండి భరోసా ఇవ్వాల్సింది పోయి, వారు విడుదలయ్యాక తాడేపల్లి ప్యాలెస్లో కేవలం పలకరింపులకే పరిమితమవ్వడం జగన్ నైజం. నాయకులను రెచ్చగొట్టి, వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్యాలెస్ నుండి ట్వీట్లు వరకే పరిమితమవుతున్నారు. వారి బాధలతో జగన్ రాజకీయం చేస్తున్నారు. తమను బలి పశువులుగా వాడుకుంటున్నారని వారికీ క్లారిటీ ఉంది. కానీ.. ఏం చేయలేకపోతున్నారు. అలా ఇరుక్కుపోయారు.
