ఒకప్పుడు జనంలోకి వెళ్లినప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడేవారు. పాదయాత్ర సమయంలో లక్షలాది మంది ముందు పేపర్ చూడకుండా గంటల తరబడి ప్రసంగించిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో ఆయన మాటల్లో ఒక స్పష్టత, వేగం ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది. చివరకు అందరికీ నమస్కారం అనాలన్నా లేదా లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడటం వంటి చిన్న విషయాలపై విమర్శలు చేయాలన్నా స్క్రిప్ట్ వైపు చూడాల్సి రావడం వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందనే అనుమానం పార్టీ వీరాభిమానుల్లో మొదలైంది.
జగన్‌ను ఆత్మన్యూనతలోకి ప్లాన్డ్గా నెట్టేశారు!
జగన్ రెడ్డికి ఏమీ తెలియదనే భ్రమను ఆయనే నమ్మేలా చేయడంలో సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ టీమ్ సక్సెస్ అయిందనేది క్యాడర్ ప్రధాన ఆరోపణ. నువ్వు ఏదైనా తప్పు మాట్లాడితే పరువు పోతుంది.. ప్రత్యర్థులు ట్రోల్ చేస్తారు అని భయపెట్టి, ఆయనలోని సహజ సిద్ధమైన నాయకత్వ లక్షణాలను చంపేశారని కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ అతి జాగ్రత్తే జగన్‌ను ఒక రీడింగ్ మెషిన్ గా మార్చేసింది. సొంతంగా ఆలోచించి మాట్లాడే శక్తి లేదనే ముద్ర పడేలా చేయడంలో సజ్జల క్యాంప్ వ్యూహం పక్కాగా అమలు జరుగుతోందనిపిస్తోందని వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో భగ్గుమంటున్నారు.
స్క్రిప్ట్ రాజకీయంతో దెబ్బతింటున్న వ్యక్తిత్వం
రాజకీయాల్లో మాట తీరు చాలా ముఖ్యం. కానీ జగన్ రెడ్డి ప్రతి అక్షరాన్ని పేపర్ చూసి చదవడం వల్ల ఆయన సహజత్వం కోల్పోయారు. లోకేష్ కొలంబో వెళ్లడం వంటి అతి సామాన్యమైన అంశాలను కూడా చూసి చదవడం చూస్తుంటే.. అది జగన్ రెడ్డి వైఫల్యం కంటే, ఆయన చుట్టూ ఉన్న సలహాదారుల వైఫల్యమే అనిపిస్తుంది. నాయకుడిని ఒక రబ్బర్ స్టాంప్‌లా మార్చి, తామే సర్వస్వం అన్నట్టుగా సజ్జల వ్యవహరించడం వల్ల పార్టీ ఇమేజ్ గ్రౌండ్ లెవల్లో దారుణంగా పడిపోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
కోటరీ గుప్పిట్లో ముఖ్యమంత్రి
పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే కరడుగట్టిన కార్యకర్తలు సైతం ఈ మార్పును జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ రెడ్డికి తెలియకుండానే ఆయనను ఒక బందీగా మార్చేశారని, ప్రతి చిన్న విషయానికి సలహాదారులపై ఆధారపడేలా చేయడం వెనుక లోతైన రాజకీయ కుట్ర దాగి ఉందనే చర్చ సాగుతోంది. జగన్ రెడ్డి ఇమేజ్ను టార్నిష్ చేసి, ఆయనను జనానికి దూరం చేయడమే సజ్జల అంతిమ లక్ష్యమా అనే ప్రశ్నలు ఇప్పుడు వైసీపీ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తున్నాయి.
నాయకత్వ లోపం కాదు.. సలహాల విషం
నిజానికి జగన్ రెడ్డికి ఉన్న వాగ్ధాటి గురించి అందరికీ తెలుసు. కానీ అధికారంలోకి వచ్చాక ఆయన చుట్టూ చేరిన కోటరీ ఆయనను ఒక చదువరీ గా మార్చేసింది. ప్రజల కళ్ళలోకి చూసి మాట్లాడాల్సిన నాయకుడు, పేపర్ల వైపు చూస్తూ మాట్లాడటం వల్ల ఓటర్లతో కనెక్ట్ తగ్గిపోయింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, జగన్ రెడ్డి తన స్వయం ప్రతిపత్తిని కోల్పోయి, కేవలం సలహాదారుల చేతిలో కీలుబొమ్మగా మిగిలిపోతారనే ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.


