జగన్ మోహన్ రెడ్డికి దమ్ముంటే.. ఎన్నికల కమీషన్ ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్‌పై ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి తక్షణమే మద్దతు ప్రకటించాలని వైఎస్ షర్మిల సవాల్ చేశారు. విజయనగరంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఈవీఎంలు మారిపోయాయని, ఓట్లు గల్లంతయ్యాయని జగన్ చేసిన ఆరోపణలు నిజమే అయితే, ఇప్పుడు పార్లమెంట్ వేదికగా ఎన్నికల కమీషన్‌ను నిలదీసే అవకాశం వచ్చిందని గుర్తు చేశారు.
కేవలం మీడియా ముందు దొంగ ఏడుపులు ఏడవడం కాకుండా, వైఎస్సార్సీపీ ఎంపీలందరితో ఈ అభిశంసన తీర్మానంపై సంతకాలు చేయించి, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆమె సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని దొంగతనంగా ఏర్పడిన ప్రభుత్వం అని విమర్శిస్తున్న జగన్, ఆ దొంగతనానికి సహకరించినట్లు భావిస్తున్న ఎన్నికల కమీషన్ మీద పోరాడటానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారని సూటిగా షర్మిల నిలదీశారు. ఈ విషయంలో జగన్ మౌనంగా ఉంటే, ఆయన మోదీకి కేవలం దత్తపుత్రుడు మాత్రమే కాదు, బీజేపీకి బీ-టీమ్ అని రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోతుందని షర్మిల ఎద్దేవా చేశారు.
ఇండియా బ్లాక్ ఎంపీలు ఎన్నికల కమీషన్ అక్రమాలపై గళం విప్పుతుంటే, జగన్ మాత్రం తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కమీషన్ తీరుపై పోరాటంలో వైఎస్సార్సీపీ ఇచ్చే మద్దతును బట్టే ఆ పార్టీకి ప్రజాస్వామ్యంపై ఉన్న గౌరవం బయటపడుతుందని, లేదంటే జగన్ ఏడుపులన్నీ కేవలం రాజకీయ నాటకాలేనని తేలిపోతుందని ఆమె స్పష్టం చేశారు. షర్మిల చేసిన ఈ సవాల్ తమకు తెలియనట్లుగా ఉంటే మంచిదని వైసీపీ అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వారు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పై అభిశంసనకు మద్దతిచ్చే పరిస్థితుల్లో లేరు. అదే జరిగితే.. ఏం జరుగుతుందో.. వైసీపీ పెద్దలకు బాగా తెలుసని అనుకోవచ్చు.


