మళ్లీ పాదయాత్ర చేస్తానంటూ జగన్ చేసిన ప్రకటనపై షర్మిల సెటైర్లు వేశారు. జగన్ తలపెట్టిన పాదయాత్ర కేవలం అధికారం కోసమేనని, ప్రజల పట్ల చిత్తశుద్ధి లేని యాత్రల వల్ల ప్రయోజనం లేదన్నారు. అధికారం ఇచ్చినప్పుడు జగన్ ఏం చేశారని ప్రశ్నించిన ఆమె.. వైఎస్సార్ జలయజ్ఞం పూర్తి చేయలేదని, నవరత్నాల హామీలకు దిక్కులేదని ఎద్దేవా చేశారు. మద్యనిషేధం చేస్తానన్న హామీని తుంగలో తొక్కి, కల్తీ మద్యంతో మాఫియాను ప్రోత్సహించారని, చివరకు పవిత్రమైన రుషికొండను కూడా బోడిగుండు చేశారన్నారు.
ఒక మనిషి నిజమైన నైజం తెలియాలంటే అధికారం ఇచ్చి చూడాలని అబ్రహం లింకన్ అన్నారని జగన్ కు అధికారం ఇచ్చిన ప్రజలు ఆయన నైజం తెలుసుకున్నారని అన్నారు. జగన్కు అధికారం సూట్ అవ్వలేదని షర్మిల వ్యాఖ్యానించారు. ఐదేళ్ల పాలనలో జగన్ ఏరోజూ ప్రజల కోసం బయటకు రాలేదని, తన పార్టీ నాయకులకు కూడా అందుబాటులో లేకుండా పోయారని గుర్తు చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే సిద్ధం అంటూ డ్రామాలాడుతూ ప్రజల ముందుకు వచ్చారని, జగన్ తన స్వార్థాన్ని వీడి మంచితనాన్ని పెంచుకుంటేనే భవిష్యత్తులో దేవుడు కానీ, ప్రజలు కానీ ఆశీర్వదిస్తారని ఆమె హితవు పలికారు.
వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే, ఏడాదిన్నర తర్వాత చేసే పాదయాత్రను ఇప్పుడే ప్రకటించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని షర్మిల ప్రశ్నించారు. ఇది ప్రజల కోసం చేసే యాత్ర కాదని, కేవలం పొలిటికల్ గిమ్మిక్ మాత్రమేనని ఆమె కొట్టిపారేశారు. జగన్ నైజం మారకుండా ఎన్ని యాత్రలు చేసినా ఫలితం ఉండదని, ప్రజల కష్టాలను పట్టించుకోని వారికి మళ్లీ అధికారం దక్కడం అసాధ్యమని ఆమె స్పష్టం చేశారు.
