నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చారిత్రాత్మక పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్ వారసత్వ ‘ యుద్ధం ముదిరింది. వైఎస్సార్ ఆశయాల గురించి జగన్ మోహన్ రెడ్డి చేసిన ట్వీట్‌కు, ఆయన సోదరి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అంతే దీటుగా, ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. జగన్ కేవలం వైఎస్సార్ పేరును వాడుకుంటూ, ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని, బీజేపీకి తొత్తుగా మారి సొంత సిద్ధాంతాలను తాకట్టు పెట్టారని షర్మిల నిప్పులు చెరిగారు.
జగన్ మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా వేదికగా వైఎస్సార్ పాదయాత్రను స్మరించుకుంటూ.. ఆ యాత్ర రాష్ట్ర చరిత్రను మార్చిందని, పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని కొనియాడారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో రైతులను రాజులను చేశారని పేర్కొన్నారు. అయితే, జగన్ చేసిన ఈ నివాళిని షర్మిల తీవ్రంగా తప్పుబట్టారు. వైఎస్సార్ ఆశయాలకు జగన్ పూర్తి భిన్నధృవమని, ఆయన ఆత్మ క్షోభించేలా జగన్ పాలన సాగిందని ఆమె విమర్శించారు.
జగన్ బీజేపీకి దాసోహం కావడాన్ని షర్మిల ప్రధానంగా ఎండగట్టారు. వైఎస్సార్ ఆజన్మాంతం లౌకికవాదాన్ని ఊపిరిగా నమ్ముకున్నారు. కానీ ఆయన కుమారుడిగా మీరు కేసులకు భయపడి, రాజకీయ భవిష్యత్తు కోసం మతోన్మాద బీజేపీ దగ్గర మోకరిల్లడం ఎంతవరకు ధర్మం అని ఆమె ప్రశ్నించారు. వక్ఫ్ చట్టం, దళిత క్రైస్తవుల రిజర్వేషన్లు వంటి అంశాల్లో బీజేపీకి ఢిల్లీలో బేషరతుగా మద్దతు ఇస్తూ, గల్లీలో మౌనంగా ఉండటం వైఎస్సార్ సిద్ధాంతాలకు ద్రోహం చేయడమేనని షర్మిల స్పష్టం చేశారు.
జగన్ ఐదేళ్ల పాలనలో దళితులు, మహిళలు, మైనారిటీలపై జరిగిన దాడులు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉన్నాయని షర్మిల ధ్వజమెత్తారు. వైఎస్సార్ ప్రారంభించిన జలయజ్ఞం, పోలవరం పనులను జగన్ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. వైఎస్సార్ పేరును పార్టీ పేరులో పెట్టుకున్నంత మాత్రాన వారసులు కాలేరని.. జగన్ ఇప్పుడు చేయాల్సింది పాదయాత్ర కాదు, ఆత్మవిమర్శన యాత్ర అని ఆమె ఎద్దేవా చేశారు. షర్మిల ట్వీట్ ..నేరుగా జగన్ పోస్టును రీట్వీట్ చేస్తూ ఇవ్వడంతో వైసీపీ వర్గాలు షాక్‌కు గురయ్యాయి.
