వృద్ధ జనాభా పెరుగుతున్న అంశం, తగ్గుతున్న జనాభా విషయంలో చంద్రబాబు భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్నారు. అయితే ఆయన చెబుతున్న మాటల్ని రాజకీయంగా తీసుకుని విమర్శలు చేస్తున్నారు నేతలు. తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల చంద్రబాబు ఇచ్చే బోడి పాతిక వేల కోసం మూడోబిడ్డను కనాలా అని ప్రశ్నించారు.
ఏలూరు జిల్లా భీమడోలులో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన పాపులేషన్ పాలసీపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఉన్న బిడ్డలకే సరిగ్గా తిండి పెట్టలేని, ఉద్యోగ అవకాశాలు కల్పించలేని దుస్థితి ఉంటే.. ఇప్పుడు కొత్తగా ముగ్గురు బిడ్డలను కనాలని చెప్పడం హాస్యాస్పదం అని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాలికొదిలేసి ఇలాంటి వింత విధానాలను తీసుకురావడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ముగ్గురు పిల్లలను కంటే ఇస్తామంటున్న ప్రోత్సాహకాలపై షర్మిల తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. \ముగ్గురు బిడ్డలను కంటే మీరు ఇచ్చే ఆ బోడి 25 వేల రూపాయలకు ఏమొస్తుంది? ఆ డబ్బుతో ఆ బిడ్డను పెంచగలరా? లేక చదివించగలరా? అని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందని, ఉన్న బిడ్డలకే ఉద్యోగాల దిక్కులేక యువత రోడ్డున పడుతుంటే, జనాభాను పెంచమనడం పాలకుల అవివేకానికి నిదర్శనమని ఆమె మండిపడ్డారు.
జగన్, చంద్రబాబు కలిసి రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని షర్మిల ఆరోపించారు. ఆరోగ్య శ్రీ బకాయిలు 3 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు 6 వేల కోట్లు పెండింగ్లో పెట్టి, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం, కొత్తగా బిడ్డలను కనమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలను మాఫియాల పేరుతో దోచుకుంటూ, విద్యుత్ ఛార్జీల భారం మోపుతూ ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోవాలని ఆమె హితవు పలికారు.