మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న ఆయన కుమార్తె సునీతా రెడ్డి తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తును కేవలం కొందరికి మాత్రమే పరిమితం చేస్తూ హైదరాబాద్ సీబీఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆమె సవాల్ చేశారు. హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులను, కుట్ర కోణాన్ని వెలికితీయకుండా విచారణను పరిమితం చేయడం సరికాదని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ కేసులో పూర్తిస్థాయిలో, సమగ్రమైన దర్యాప్తు జరిగేలా కేంద్ర దర్యాప్తు సంస్థ ను ఆదేశించాలని సునీత అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. హత్య జరిగిన నాటి నుండి ఈ కేసులో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి. దర్యాప్తు అధికారి మార్పు, నిందితుల బెయిల్ పిటిషన్లు, రాజకీయ ఆరోపణల మధ్య విచారణ ప్రక్రియ నెమ్మదించిందనే ఆందోళనను సునీతా రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, క్షేత్రస్థాయిలో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసిన వారు , ఈ కుట్రలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న పెద్దల పేర్లను బయటకు తీసుకురావాలంటే సమగ్ర దర్యాప్తు ఒక్కటే మార్గమని ఆమె వాదిస్తున్నారు.
సునీతా రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 20వ తేదీన ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరపనుంది. సీబీఐ కోర్టు విధించిన పరిమితులు దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి , సాక్షుల భద్రత వంటి అంశాలను సుప్రీంకోర్టు పరిశీలించే అవకాశం ఉంది. 20వ తేదీన జరిగే విచారణలో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు ఈ హత్య కేసు దర్యాప్తును మలుపు తిప్పే అవకాశం ఉంది.
