ఆస్తిపాస్తుల కంటే ఆత్మీయతలే మిన్న అని నమ్మే ఒక తల్లి, తన సొంత కుమారుడే కోర్టు మెట్లు ఎక్కిన వేళ పడుతున్న ఆవేదన చెన్నై ఎన్సీఎల్టీ వేదికగా బయటపడింది. సరస్వతి పవర్ షేర్ల బదలాయింపుపై జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌కు విజయమ్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. నాపై ఉన్న ప్రేమ, ఆప్యాయతతోనే జగన్ ఆనాడు షేర్లను గిఫ్ట్ డీడ్ ద్వారా రాసిచ్చారు.. ఆ ప్రేమను ఆయన ఇప్పుడు కాదనలేరు అంటూ ఆమె పేర్కొన్న మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఒకప్పుడు ప్రేమ ఉందని ఇచ్చి, ఇప్పుడు ప్రేమ లేదని వెనక్కి తీసుకోవాలనుకోవడం రాజకీయంగానే కాకుండా నైతికంగా కూడా చర్చనీయాంశమవుతోంది.
బినామీ ఆరోపణలపై ధీటైన సమాధానం
ఈ వివాదంలో తన కుమార్తె షర్మిలకు తాను బినామీ ని అంటూ జగన్ చేసిన ఆరోపణలను విజయమ్మ తీవ్రంగా ఖండించారు. నేను ఎవరికీ బినామీని కాదు.. నా పిల్లల మధ్య సయోధ్య కుదర్చడమే తల్లిగా నా బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడే ఆస్తుల పంపకాలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, ఆ ప్రకారమే షర్మిలకు వాటా దక్కాలని ఆమె తన కౌంటర్లో గుర్తు చేశారు. ఒక తల్లిని బినామీగా చిత్రించడం పట్ల ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఆమె అఫిడవిట్ లోని పదజాలం స్పష్టం చేస్తోంది.
ఒప్పందం ప్రకారమే షేర్ల బదలాయింపు
2019లో జరిగిన ఎంఓయూ ప్రకారం జగన్ స్వచ్ఛందంగానే షేర్లను తనకు బదలాయించారని, అది చట్టబద్ధమైన ప్రక్రియేనని విజయమ్మ వివరించారు. ఆ షేర్లను తాను షర్మిలకు ఇవ్వడం అన్నది కుటుంబ ఒప్పందంలో భాగమే తప్ప, ఇందులో ఎలాంటి అక్రమాలు లేవని పేర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ప్రక్రియ అంతా జరిగిందని, ఇప్పుడు రాజకీయ కారణాలతో లేదా ఇతర విద్వేషాలతో కుమారుడు ఇలా ప్రవర్తించడం తల్లిగా తనను ఎంతో బాధిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
రాసిచ్చిన ఆస్తుల కోసం తల్లి, చెల్లిని వేధిస్తున్న జగన్
ఇప్పటికే రాసిచ్చిన ఆస్తుల కోసం జగన్ తల్లి, చెల్లిని ఇలా కోర్టుకు లాగడం.. వారు తమ ఆవేదనను కోర్టుల్లో అఫిడవిట్ల రూపంలో చెప్పుకుంటూడటం వారిని ఆభిమానించేవారిని వేదనకు గురి చేస్తోంది. జగన్ తీరుపై అసహనం వచ్చేలా చేస్తోంది. తల్లి, చెల్లి విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించే జగన్ కు మానవత్వం ఎలా ఉంటుందన్న ప్రశ్నలు వస్తున్నాయి.


