వివేకా కేసులో దర్యాప్తు ముగిసిందని అయితే సుప్రీంకోర్టు ఆదేశిస్తే మరింత లోతుగా విచారణ చేస్తామని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. గత విచారణలో విచారణ ఇంకా అవసరం అని భావిస్తున్నారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో ఆ మేరకు ఈ విచారణలో సీబీఐ సమాధానం ఇచ్చారు. మరో రెండు అంశాలపైనా క్లారిటీ ఇచ్చింది. గతంలో సుప్రీంకోర్టే గడువు పెట్టినందున సీబీఐ ఆ గడువులోపు విచారణ పూర్తి చేశామని.. సీబీఐ చెప్పుకునేందుకు దర్యాప్తు ముగిసిందని చెప్పిందని అంచనా వేస్తున్నారు.
అయితే దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూసినందున మరింత దర్యాప్తు చేసి.. దర్యాప్తు, ట్రయల్ రెండు ఒకే సారి సాగేలా సీబీఐ తరపు లాయర్లు సుప్రీంకోర్టును ఒప్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరో వైపు అవినాష్ రెడ్డితో పాటు నిందితులు సాక్షుల్ని బెదిరిస్తున్నందున వారి బెయిల్స్ రద్దు చేయాలన్న అంశంపైనా విచారణ జరుగుతోంది. అయితే సునీత తరపు లాయర్ వేరే కోర్టులో ఉండటంతో ఆయన వచ్చే వరకూ కేసు పాస్ ఓవర్ ఇచ్చారు.
వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలే కీలకం కానున్నాయి. నిందితులు ఇప్పటికే అందరూ బెయిల్స్ మీద ఉన్నారు. దర్యాప్తు ముగిసిందని సీబీఐ చెప్పడం ద్వారా కొంత మంది మాత్రమే నిందితులు అయ్యే అవకాశం ఉందని.. అసలైన సూత్రధారులు తప్పించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ అంశంపై జరగబోయే పరిణామాలు ఉత్కంఠ భరితంగా ఉండనున్నాయి.