వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణంగా కెరీర్ మొత్తాన్ని నాశనం చేసుకుని, జైలు పాలయి.. అవినీతి అధికారిణిగా ముద్ర వేసుకున్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై ఇప్పుడు వైసీపీ కొత్తగా ఆరోపణలు చేస్తోంది. ఆమె టీడీపీ నేతలతో కుమ్మక్కయి తమపై అవినీతి ముద్ర వేశారని ఆ పార్టీ నేతలు రివర్స్ ఆరోపణలు చేస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి మహిళా ఐఏఎస్ అధికారిణిపై ఆరోపణలు చేశారు. ఆమె పేరు నేరుగా చెప్పలేదు కానీ .. సాక్షికి సిస్టర్ చానల్స్ అయిన టీవీ9, ఎన్టీవీ బహిరంగంగా పేరుతో సహా చెప్పేశాయి. అంటే ఎవరికైనా డౌట్ ఉంటే క్లారిటీ తీసుకోమని చెప్పారన్నమాట.
భూమన కరుణాకర్ రెడ్డి అత్యంత దారుణంగా ఐఏఎస్ శ్రీలక్ష్మిపై ఆరోపణలు చేశారు. రూ. లక్షలన్నర ఖరీదైన చీరలను రోజూ కడతారని.. ఆమె జీతం ఎంత అని భూమన ప్రశ్నించారు. అవినీతితో వేల కోట్లు సంపాదించారని మండిపడ్డారు. సర్వీస్ మొత్తం అవినీతేనన్నారు. ఆమె మున్సిపల్ శాఖ ఉన్నతాధికారిగా ఉన్నప్పుడు టీడీఎస్ స్కామ్ చేయకుండా తాము ఆపామని అందుకే టీడీపీ నేతలతో చేతులు కలిపి రెండు వేల కోట్లు దోచుకున్నామని ఆరోపణలు చేయించారన్నారు. భూమన ఇంకా చాలా ఆరోపణలు చేశారు. అయితే జగన్ రెడ్డి కోసం జైలుకెళ్లిన శ్రీలక్ష్మిపై ఇప్పుడు ఆరోపణలు చేయడం ఏమిటన్నది అసలు ఎవరికీ అంతు చిక్కని విషయం.
శ్రీలక్ష్మితో వైసీపీకి సంబంధం లేదని వదిలించుకునే క్రమంలో భూమన ఈ ఆరోపణలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు. భూమన జగన్ కోటరీలో కీలక వ్యక్తి. ఆయన పై నుంచి ఆదేశాలు రాకుండా ఇలాంటి కీలకమైన ఆరోపణలు చేయరు. వైసీపీ నేతలు వాడుకున్నంతకాలం వాడుకుని వదిలేస్తారు. జగన్మోహన్ రెడ్డి .. తన రాజకీయానికి, అవినీతికి అవసరమైన వారిని వాడుకుని.. చివరికి నట్టేట ముంచుతారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో శ్రీలక్ష్మిని అలాగే చేస్తున్నారన్న అబిప్రాయం వ్యక్తమవుతోంది.