రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ.. ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కొనలేక వారి ఇళ్లలోని మహిళలను, క్షేత్రస్థాయిలో ఉన్న మహిళా నాయకురాళ్లను టార్గెట్ చేయడం ఒక దారుణమైన సంప్రదాయం వైసీపీతో ప్రారంభమయింది. ఆ పార్టీ అధినేత మానసిక స్థితికి తగ్గట్లుగా ఈ సంస్కృతిని ఆ పార్టీ నేతలు పరాకాష్టకు తీసుకెళ్లారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు అహంకారంతో మహిళా నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ఆ పార్టీ నేతలు.. 2024 ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి పాతాళానికి తొక్కేసినా, కనీసం విపక్ష హోదా కూడా దక్కకుండా చేసినా తమ కీచక బుద్ధిని మార్చుకోలేకపోతున్నారు.
మారకపోవడం కీచక నేతల లక్షణం
ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో అసెంబ్లీ సాక్షిగా సాగిన అరాచకాలు రాష్ట్ర చరిత్రలోనే ఒక మచ్చగా మిగిలిపోయాయి. సాక్షాత్తూ నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపల అత్యంత ఘోరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని, నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉండే ఒక ఉన్నతమైన మహిళపై పాలకులే కక్షగట్టి బురదజల్లడంతో.. చంద్రబాబు వంటి సీనియర్ మోస్ట్ లీడర్ ప్రెస్ మీట్ లోనే కన్నీరు పెట్టుకోవాల్సి వచ్చింది. ఆనాడు ఆంధ్రదేశంలోని ప్రతి సగటు మహిళా హృదయం ఆ ఘటనతో ద్రవించిపోయింది. వైఎస్సార్సీపీ పతనం ఆనాడే ఖరారైందని చెప్పడానికి గత ఎన్నికల ఫలితాలే సజీవ సాక్ష్యం.
అమర్నాథ్ ఓ ముక్క.. అందరూ అంతే !
కానీ, కుక్క తోక వంకర అన్నట్లు.. అధికారం పోయినా తాడేపల్లి బృందం తీరులో రవ్వంతైనా మార్పు రాలేదని తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఒక దళిత మహిళ వంగలపూడి అనితను ఉద్దేశించి.. ఆమె పరిపాలనను, విధివిధానాలను విమర్శించడం చేతకాక.. ఆమె ఒక మేకప్ మంత్రి.. కిలోల కొద్దీ మేకప్ వేసుకుంటుంది అంటూ ఆమె కట్టు, బొట్టు, శారీరక రూపాన్ని హేళన చేస్తూ అమర్నాథ్ దారుణమైన కామెంట్లు చేశారు. ఒక మాజీ మంత్రి హోదాలో ఉండి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళా హోంమంత్రిని ఇంత దిగజారి విమర్శించడం వైఎస్సార్సీపీ నేతల అంతర్గత సంస్కార హీనతకు అద్దం పడుతోంది.
గుడివాడకు మద్దతుగా వైసీపీ ఉండటమే అసలు నీచం
ఇది కేవలం తనపై జరిగిన వ్యక్తిగత దాడి మాత్రమే కాదు. ఒక దళిత మహిళ రాజకీయంగా అత్యున్నత స్థానానికి ఎదగడాన్ని సహించలేక వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న కులపరమైన దాడి . అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. రాజకీయ విమర్శలు ఎప్పుడూ ప్రభుత్వ విధానాలపై ఉండాలి తప్ప.. మహిళల దుస్తులు, వారి రూపురేఖలపై కాదు. వైఎస్సార్సీపీ నేతలు తమ సొంత ఇళ్లలోని మహిళలను కూడా ఇలాగే అవమానిస్తారేమో.. సమాజం వీరి మాటలను నిశితంగా గమనిస్తోంది అంటూ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అయినప్పటికీ తాడేపల్లి సోషల్ మీడియా విభాగాలు ఇంకా ఈ అసభ్యకరమైన ట్రోలింగ్‌ను వెనకేసుకురావడం గమనార్హం.
మహిళలే అపరకాళికలవ్వాలి !
రాజకీయాల్లో ప్రత్యర్థులను పడగొట్టడానికి మహిళల ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టే ఇలాంటి కీచక రాజకీయ పార్టీని ఆంధ్రప్రదేశ్ మహిళా లోకం శాశ్వతంగా, సామాజికంగా బహిష్కరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆడబిడ్డల కన్నీళ్లపై ఏ రాజ్యాంగం, ఏ సామ్రాజ్యం నిలబడలేదనే కనీస సత్యాన్ని వైఎస్సార్సీపీ ఇంకా గ్రహించకపోవడం ఆ పార్టీ శరవేగంగా అంతిమ దశకు చేరుకుంటోందనడానికి సంకేతం. వైసీపీ ఆ దేశలోనే ఉంది.
