ఏపీ రాజకీయాల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెద్దపాడు కేంద్రంగా సాగుతున్న పరిణామాలు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్షగా మారాయి. ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అత్యంత పదునైన పొలిటికల్ మైండ్ గేమ్ తో వైసీపీని ఆత్మరక్షణలో పడేశారు. కేవలం ఒక ఆలయ పునరుద్ధరణ వివాదంతో మొదలైన ఈ వ్యవహారం, ఇప్పుడు జగన్ రెడ్డి తన ఓటు బ్యాంకును ఎంతగా నిర్లక్ష్యం చేస్తారనే వాదనను బలంగా వినిపించేలా మార్చారు.
సొంత ఓటు బ్యాంకుకు జగన్ మొండిచేయి
వైసీపీకి దశాబ్దాలుగా వెన్నెముకలా నిలుస్తున్న కన్వర్టెడ్ క్రిస్టియన్ల ఓటు బ్యాంకు ఇప్పుడు ఆ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉంది. పెదపాడు ఘటనలో ఆ వర్గానికి చెందిన వారు ఇబ్బందుల్లో ఉన్నా, వారిపై దాడులు జరుగుతున్నా జగన్ మోహన్ రెడ్డి కానీ, వైసీపీ అగ్రనాయకత్వం కానీ కనీసం స్పందించలేదు. సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో ఇచ్చిన తీర్పుపై కూడా వైసీపీ మౌనం వహించింది. ఇప్పుడు తమ నియోజకవర్గాల్లోనే తమ వర్గం సమస్యల్లో ఉంటే జగన్ పట్టించుకోకపోవడం చూస్తుంటే, ఆయనకు కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే వారిని చూస్తున్నారు. వారి కష్టసుఖాలతో ఆయనకు సంబంధం లేదని రఘురామ నిరూపిస్తున్నారు.
రఘురామ రివర్స్ స్ట్రాటజీ
పెద్దపాడు ఘటన తర్వాత రఘురామకృష్ణరాజు తన వ్యూహాన్ని మార్చారు. ఆయన కేవలం హిందూ ధర్మం గురించి మాత్రమే మాట్లాడకుండా, జగన్ రెడ్డి తనను నమ్ముకున్న వర్గాలను ఎలా గాలికొదిలేశారో నిరూపిస్తున్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం తప్ప, తన ఓటు బ్యాంకుకు ఆపద వస్తే నోరు మెదపని నాయకుడు జగన్ అనే ముద్రను ఆయన వేస్తున్నారు. అటు హిందూ వర్గాల్లో భరోసా కల్పిస్తూనే, ఇటు కన్వర్టెడ్ క్రిస్టియన్లలో మన నాయకుడు మనల్ని పట్టించుకోవడం లేదు అనే ఆలోచన రేకెత్తించడంలో RRR సఫలమవుతున్నారు. ఇది వైసీపీ కోటను లోపలి నుంచే కూల్చేసే స్ట్రాటజిక్ ఎటాక్ .
వైసీపీ మౌనం – రాజకీయ ఆత్మహత్యేనా?
ఈ వివాదంపై వైసీపీ మౌనం వహించడం వల్ల ఉండి నియోజకవర్గంలో హిందూ వర్గం పూర్తిస్థాయిలో రఘురామ వైపు పోలరైజ్ అవుతుండగా, ఇటు కన్వర్టెడ్ క్రిస్టియన్లు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తాము అనాథలమయ్యాము అనే భావనకు లోనవుతున్నారు. మద్దతు ప్రకటిస్తే హిందూ ఓట్లు పోతాయని, ప్రకటించకపోతే నమ్ముకున్న వారు పోతారనే భయంతో వైసీపీ చేస్తున్న సేఫ్ గేమ్ చివరకు ఆ పార్టీకి రాజకీయ శూన్యతను మిగిల్చేలా ఉంది. జగన్ రెడ్డి తన మౌనాన్ని వీడి ఈ వర్గాలకు భరోసా ఇవ్వకపోతే, రఘురామకృష్ణరాజు వేసిన ఈ వ్యూహాత్మక ఉచ్చులో వైసీపీ తన ప్రధాన ఓటు బ్యాంకును శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది.
సొంత వారికి అండగా ఉండలేరా?
పెద్దపాడు ఘటనను సాకుగా తీసుకుని రఘురామకృష్ణరాజు ఒక పెద్ద రాజకీయ ప్రయోగాన్ని విజయవంతం చేశారు. ఒక నాయకుడు తనను నమ్మిన వారిని ఎలా వదిలేస్తారో కళ్లకు కట్టినట్లు చూపిస్తూ జగన్ రెడ్డి అసలు రంగును బయటపెడుతున్నారు. ఈ పోలరైజేషన్ కేవలం ఉండి నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా వైసీపీని బలహీనపరిచే అస్త్రంగా మారనుంది. వైసీపీ నాయకత్వం ఇప్పటికైనా మేల్కోకపోతే, తమ సొంత ఓటు బ్యాంకుతోనే తమ పతనాన్ని స్వయంగా రాసుకున్నట్లవుతుంది.
