ఆంధ్రప్రదేశ్లో కూటమి కలసి ఉంటే జగన్ రెడ్డి ఎప్పటికీ గెలవలేదని ఆయన శ్రేయోభిలాషులు నేరుగా బయటకు వచ్చి చెబుతున్నారు. అలాంటి సమయంలో పవన్ కల్యాణ్ కూటమికి భరోసా ఇస్తూ పదిహేనేళ్లూ కూటమి అధికారంలో ఉంటుందని.. ఏపీ ప్రజలను ఉన్నత స్థాయిలో నిలబెడుతుందని భరోసా ఇస్తున్నారు. నారా లోకేష్ కూడా అదే అంటున్నారు. విడిపోయేదే ఉండదని .. పదిహేనేళ్లు కూటమి ఉంటుందని ప్రకటిస్తున్నారు. అగ్రనేతల మధ్య ఈ మాత్రం అండర్ స్టాండింగ్ ఉంటే చాలు.. విపక్షాల ఆశలు గల్లంతు కావడానికి.
కూటమి ఐక్యత చెదరగొట్టడానికి వైసీపీ కుట్రలు
ఏపీ రాజకీయంలో వైసీపీకి ఉన్న ఆశ ఒక్కటే. అది కూటమిలో తేడాలు తీసుకు రావడం, జనసేన పార్టీని బయటకు తీసుకురావడం. అందుకే పార్టీల మధ్య అపోహలు పెంచడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. సాక్షి మీడియా, సోషల్ మీడియాతో చేయని కుట్రలు లేవు. ప్రతి దానికి జనసేనకు అన్యాయం అంటూ జాలి చూపించి.. రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం కామన్ గా మారింది. జనసైనికుల పేరుతో వైసీపీ సానుభూతిపరులు వేసే డ్రామాల సంగతి చెప్పాల్సిన పని లేదు. అంబటి రాంబాబు వంటి వారితో జనసేన పై చేయించే కామెంట్లు పరాకాష్టకు చేరుతాయి.
సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ తప్ప అంతా సాఫీ
టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఏడాదిన్నరగా చిన్న పొరపొచ్చాలు కూడా లేదు. పాలన విషయంలో పవన్ కల్యాణ్ నిస్సంకోచంగా కొన్ని విషయాలపై మాట్లాడుతున్నారు. ఆయన కూడా ప్రభుత్వంలో భాగం., అది రొటీన్ ప్రక్రియ. దాన్ని ప్రత్యేకంగా తీసుకోవాల్సిన పని లేదు. రాజకీయంగా కూడా పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అధికారం ఉంది కాబట్టి ఆయన పార్టీలోకి వైసీపీకి చెందిన వారు వెల్లువలా వేచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వారి ఉద్దేశం ఏంటో పవన్ కు తెలుసు. అందుకే పెద్దగా వారిని ప్రోత్సహించడం లేదు. బీజేపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. జగన్ రెడ్డి చేసిన పాలనను ప్రజలు అంత తేలికగా మర్చిపోరు కాబట్టి కూటమి మధ్య కూడా ఎలాంటి తేడాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు.
బీజేపీకి తాను స్నేహితుడ్నని చెప్పుకునేందుకు జగన్ తంటాలు
జగన్ రెడ్డికి రాజకీయంగా విలువల్లేవు. ఆయన బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకోను కానీ అన్నీ సమర్పించుకుంటానని చెబుతూంటారు. పార్టీ పెట్టినప్పటి నుండి అదే చేస్తున్నారు. అది ఆయనకు అనివార్యత. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా ఉంటే..తన తండ్రి చివరి కోరిక రాహుల్ ను ప్రధాని చేయడం అని అందరి కంటే ముందే వెళ్తారు. అత్యాశకు పోయి రాజకీయ అవినీతికి పాల్పడి ఆయన తెచ్చిపెట్టుకున్న పరిస్థితులు అవి. అలా బీజేపీకి స్నేహితుడ్నని.. తనపై చర్యలు తీసుకోదని.. తాను దత్తపుత్రుడినని నమ్మించే ప్రయత్నంలో జగన్ ఇప్పటికి సక్సెస్ అవుతున్నారు. కానీ రాజకీయం ఎప్పటిలా ఉండదు. ఆ విషయం అర్థమయ్యేసరికి.. అంతా మారిపోతుంది.
