ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, కల్తీ నెయ్యి కుంభకోణం వంటి కీలకమైన అంశంపై చర్చకు రాకుండా తప్పించుకోవడం ఆ పార్టీ పరిస్థితిని ప్రజల ముందు ఉంచుతోంది. తమకు అనుకూలమైన సంఖ్యాబలం, తమ మాట వినే చైర్మన్ ఉన్నా సరే, వైసీపీ నేతలు సభలో వాదన వినిపించలేక పలాయనం చిత్తగించడం వెనుక అసలు నిజాలు బయటపడతాయనే భయమే ప్రధాన కారణం.
మండలిలో ఆధిపత్యమే అయినా పరార్
శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉంది. ఏ నిర్ణయాన్నయినా ప్రభావితం చేయగల శక్తి, సభను నడిపించే చైర్మన్ మద్దతు ఉన్నా.. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చకు వైసీపీ సిద్ధపడకపోవడం ఆశ్చర్యకరం. నిజంగా తాము నిర్దోషులమని భావిస్తే, ప్రభుత్వం చేసిన ప్రకటనపై గట్టిగా కౌంటర్ ఇచ్చి, తమ వాదనను ప్రజల ముందుకు తీసుకెళ్లే సువర్ణావకాశాన్ని ఆ పార్టీ జారవిడుచుకుంది. అర్థరాత్రి వరకైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధమని ప్రకటించినా, వైసీపీ సభ్యులు సభ నుంచి పారిపోవడం వారి నైతిక ఓటమిని సూచిస్తోంది.
అబద్ధాలు బయటపడతాయనే భయమా?
గత కొద్ది రోజులుగా కల్తీ నెయ్యి విషయంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలన్నీ కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని, సభలో చర్చ జరిగితే సాక్ష్యాలతో సహా అన్నీ బయటపడతాయని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. టెండర్ల ప్రక్రియలో జరిగిన లోపాలు, నాణ్యత లేని నెయ్యి సరఫరా చేసిన సంస్థలకు కట్టబెట్టిన వైనంపై ప్రభుత్వం దగ్గర ఉన్న పక్కా ఆధారాలు బయటకు వస్తే, తమ దుర్మార్గం ప్రజలందరికీ అర్థమవుతుందని వారు భావిస్తున్నారు. అందుకే, చర్చ కంటే గందరగోళం సృష్టించి బయటకు వెళ్లడమే క్షేమమని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది.
మండలికి వచ్చి చేస్తున్నదేమిటి?
ప్రభుత్వం ఈ వ్యవహారంపై అత్యంత పారదర్శకమైన విచారణకు సిద్ధమై, అసెంబ్లీ , మండలిలో వివరణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కానీ, వైసీపీ నేతలు మాత్రం సాంకేతిక కారణాలు చూపుతూ చర్చను అడ్డుకోవడం వారి ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది. బయట మైకుల ముందు గంభీరంగా మాట్లాడే నేతలు, సభ లోపల ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేయడం వారి బలహీనతను చాటుతోంది. చర్చ జరిగితే కల్తీ నెయ్యి స్కామ్ లో ఎవరెవరి హస్తం ఉందో అధికారికంగా రికార్డుల్లోకి వెళ్తుందనే భయం వారిని వెంటాడుతోంది. అబద్ధాలతో ఎక్కువ కాలం ప్రజలను నమ్మించలేమని, సభలో చర్చకు భయపడటమే ఇందుకు నిదర్శనమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వైసీపీ అసెంబ్లీకి వెళ్లడం లేదు.. మండలికి హాజరవుతున్నారు.. అయితే పెద్ద తేడా లేకుండా రాజకీయాలు చేస్తున్నారు.
