వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో నిర్వహించిన మత మార్పిడి ఉదంతం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. గత 30 ఏళ్లుగా ముస్లింలుగా ఉన్న తన బాల్య స్నేహితుడు అబ్దుల్లా , ఆయన భార్య అమీనా లను హిందూ ధర్మంలోకి ఆహ్వానిస్తూ భూమన తన నివాసంలోనే హిందూ పునఃస్వీకరణ మహోత్సవం నిర్వహించడం చర్చనీయాంశమైంది. స్వయంగా తానే హోమాలు జరిపించి, వారిని మోటివేట్ చేసి మతం మారుస్తున్నానని ఆయన ప్రకటించడం వైసీపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
ఈ ఘటన ముఖ్యంగా ముస్లిం సమాజంలో తీవ్ర చర్చకు, అసహనానికి దారితీస్తోంది. వైసీపీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు, భూమన చర్యపై ఆగ్రహంగా ఉన్నారు. బీజేపీని మెప్పించడానికి లేదా వారి అడుగుజాడల్లో నడవడానికి వైసీపీ నేతలు ఇలాంటి ఘర్ వాప్సీ తరహా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ముస్లిం నేతలు ఆరోపిస్తున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిగత నిర్ణయం కాదని, హిందూత్వ ఓటు బ్యాంకును ఆకర్షించే క్రమంలో తమ మనోభావాలను తాకట్టు పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిణామం వైసీపీ ముస్లిం ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముస్లిం మైనారిటీలు గతంలో వైసీపీకి అండగా నిలిచారు. అయితే, భూమన కరుణాకర్ రెడ్డి స్వయంగా తన ఇంటినే వేదికగా చేసుకుని మత మార్పిడి కార్యక్రమాలను ప్రోత్సహించడం వల్ల తమను టార్గెట్ చేస్తున్నారన్న భావన ముస్లింలలో ఏర్పడుతోంది. వైసీపీ నాయకత్వం ఈ అంశంపై మౌనం వహించడం కూడా ముస్లింలలో అనుమానాలను పెంచుతోంది. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన భూమన ఇలాంటి చర్యలకు పాల్పడటం అంటే, అది పార్టీ అంతర్గత వ్యూహంలో భాగమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈ అసంతృప్తి ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో వైసీపీ తన బలమైన మైనారిటీ ఓటు బ్యాంకును కోల్పోయి, రాజకీయంగా భారీ నష్టాన్ని చవిచూడక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమనుతోంది.
