జ‌గ‌న్ దీక్ష‌పై వైకాపా శ్రేణుల రివ్యూ ఇదే..!

ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తాజాగా గుంటూరులో రైతు దీక్ష చేశారు. రెండు రోజుల దీక్ష అన్నారు. మొద‌టి రోజు ప్రారంభించి, మ‌ర్నాడు సాయంత్రం నిమ్మ‌ర‌సంతో దీక్ష ముగించారు. కొన్ని రైతు స‌మ‌స్య‌ల్ని ప్ర‌స్థావించి, చంద్ర‌బాబు స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ప‌నిలోప‌నిగా సీఎం కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ మీద కూడా కొన్ని పంచ్ లు వేశారు. అంతే, దీక్ష ముగిసింది. ఇంత‌కీ ఈ దీక్ష ఇంపాక్ట్ ఏంటి..? రెండు రోజులు వార్త‌ల‌కు మాత్ర‌మే జ‌గ‌న్ దీక్ష ప‌రిమిత‌మా..? రైతు దీక్ష అన్న‌ప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం ఎందుకు కదిలి రాలేదు..? రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ హ‌డావుడికి ఎందుకు క‌నిపించ‌లేదు..? తాజా రైతు దీక్ష మాత్ర‌మే కాదు… గ‌తంలో కూడా జ‌గ‌న్ చేప‌ట్టిన దీక్ష‌ల ప్ర‌భావం ఏమాత్రం..? ఎక్క‌డ తేడా వ‌స్తోంది..? ఇలాంటి అంశాల‌పై వైకాపా శ్రేణుల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైన‌ట్టు తెలుస్తోంది.

నిజానికి, ఒక స‌మ‌స్య‌పై దీక్ష‌కు దిగ‌డం అంటే… ప్ర‌భుత్వంపై అంతిమ పోరాటం అన్న‌ట్టుగా సాగాలి. ఆ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరికే వ‌ర‌కూ, లేదా దీక్ష‌ను అధికార పార్టీ భ‌గ్నం చేసేవ‌ర‌కైనా ఉండాలి. కానీ, జ‌గ‌న్ మాత్రం ఒక‌రోజు దీక్ష, రెండ్రోజులు దీక్ష అంటూ ఓ కొత్త ట్రెండ్ తెచ్చారు. రైతుల స‌మ‌స్య‌ల‌పై రెండ్రోజులే దీక్ష అని ముందే ప్ర‌క‌టించేస్తే… ప్ర‌భుత్వం స్పందించాల్సిన అనివార్య‌త, అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఎక్క‌డుంది..? స‌మ‌స్య తీవ్ర‌తను ప్ర‌భుత్వం ఫీల‌య్యే రేంజిలో ప్ర‌భావం ఎలా ప‌డుతుంది..? ఇదే కాదు… మొద‌ట్నుంచీ కూడా చంద్ర‌బాబు స‌ర్కారు స్పందించాల్సిన అర్జెన్సీ జ‌గ‌న్ దీక్ష‌ల్లో కొర‌వ‌డుతోంద‌న్న‌ది వాస్త‌వం. క‌నీసం, దీక్ష‌ను భంగం చేసే స్థాయి స్పంద‌న అయినా ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి వ‌చ్చేలా ప్రేరేపితం చేయాలి. ఈ విష‌యాన్ని పార్టీ గ్రహించాల్సిన అవ‌స‌రం ఉంది.

అయితే, జ‌గ‌న్ దీక్ష‌కు సంబంధించిన నిర్ణ‌యాల‌న్నీ త్వ‌ర‌త్వ‌ర‌గా జ‌రిగిపోతాయ‌నీ, ప్రిప‌రేష‌న్ కు పెద్దగా టైమ్ ఉండ‌ద‌నే వాద‌న వైకాపా శ్రేణుల్లో వినిపిస్తోంది. ఆయ‌న దీక్ష చేయాల‌నుకుంటున్నారు అంటే అదే ఫైన‌ల్ అనీ, దానిపై పెద్ద‌గా చ‌ర్చ‌కు కూడా ఆస్కారం ఉండ‌ద‌నే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అంటే, జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని శిర‌సావ‌హించ‌డం త‌ప్ప‌.. వ్యూహ ర‌చ‌న‌కుగానీ, స‌మాలోచ‌న‌లుగానీ తావుండ‌ద‌నేది చెప్ప‌క‌నే చెప్పిన‌ట్టు.

నిజానికి, ప్ర‌తిప‌క్ష నేత ఒక దీక్ష చేప‌డుతున్నారంటే… ముందుగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు స‌మాయ‌త్తం కావాలి. ఈ రైతు దీక్షనే తీసుకుంటే… ముందుగా అన్ని జిల్లాల్లోనూ రైతులు ముందుకొచ్చేలే అక్క‌డి పార్టీ వ‌ర్గాలు కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసుకోవాలి. జ‌గ‌న్ దీక్షకు కూర్చోగానే సంఘీ భావం తెలిపేందుకు కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు రంగంలోకి దిగాలి. ఇవ‌న్నీ ఒక వ్యూహాత్మంగా, ప‌క్కా ప్రణాళిక‌తోనే సాధ్యం అన‌డంలో సందేహం లేదు. కానీ, ఇలాంటి వ్యూహాత్మ‌క‌తే ఇంకా కొర‌వ‌డుతోంద‌న్న భావ‌న వ్య‌క్త‌మౌతోంది. పైగా, దీక్ష‌కు డెడ్ లైన్స్ పెట్టుకుంటే.. అది కేవ‌లం ఒక నిర‌స‌న కార్య‌క్ర‌మంగా మాత్ర‌మే మిగిలిపోతుంది. దీక్ష స‌క్సెస్ అవ‌డం అంటే.. అనుకున్న‌ట్టుగా ముగించ‌డం కాదు క‌దా! దీక్ష‌కు దిగిన స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించిందా లేదా అనేదే స‌క్సెస్ కు కొల‌మానం అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com