ఏ పార్టీకి అయినా కింది స్థాయి కార్యకర్తలు బలం. వారిని ఎంత బాగా కాపాడుకుంటే పార్టీ అంత బలంగా ఉంటుంది. అధికారం వచ్చే వరకూ వారిని ఉపయోగించుకుని అధికారం వచ్చాక.. వారితో పనేముందని అనుకుంటే… వైసీపీ తరహా పరిస్థితి వచ్చేస్తుంది. వైసీపీలో ఇప్పుడు క్షేత్ర స్థాయి కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు పూర్తి స్థాయిలో డీలా పడిపోయారు. దీనికి కారణం ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలే.
వైసీపీలో మునుపటి జోష్ కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాలు బలవంతంగా సాగుతున్నాయి. ర్యాలీలు నిర్వహిస్తే సొంత కార్యకర్తల కన్నా… డబ్బులిచ్చి తరలించాల్సిన వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం… సీఎం జగన్ తీసుకున్న నిర్ణయమే. పార్టీ క్యాడర్ ను విస్మరించేలా వాలంటీర్లు, వార్డు సచివాలయ కార్యదర్శల కనుసన్నల్లోనే మొత్తం జరిగేలా చేయడంతో వారంతా రగిలిపోతున్నారు.
అధికారంలోకి వచ్చే వరకు వైఎస్సార్సీపీ పార్టీ నిర్మాణం పక్కాగా ఉండేది. బూత్ స్థాయిలో కమిటీల ఏర్పాటుతో పటిష్టమైన వ్యవస్థ వుండేది. ఇప్పుడు ఆ బూత్ కమిటీలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. అధికారం చేపట్టిన మూడున్నర సంవత్సరాలుగా ఏ స్థాయిలోనూ కనీసం ఒక్కటంటే ఒక్క పార్టీ సమావేశం సైతం ఏర్పాటు చేయలేదు. అధికారంలోకి రావడానికి కృషి చేసిన వారికి కనీస పలకరింపు కూడా లేకుండా పోయింది.
ప్రతిపక్షంలో ఉండగా జగన్ పిలుపునిస్తే అందరూ కలసికట్టుగా ప్రభుత్వంపై పోరాడేవారు. దిగువస్థాయి నుంచి పార్టీ యంత్రాంగం అంతా ఎవరికి వారే స్వచ్ఛందంగా స్పందించే వారు. సహజంగా అధికారంలోకి రాగానే క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉరకలెత్తాలి. అయితే అందుకు భిన్నంగా వారిలో నైరాశ్యం ఆవరించి ఉంది. పార్టీ అధికార పీఠం అధిష్టించే వరకు క్రియాశీలంగా వ్యవహరించిన నాయకుల్లో చాలామంది ప్రస్తుతం చురుకుగా వ్యవహరించటం లేదు. దీనికి కారణం అధికారంలోకి వచ్చినా తమను పట్టించుకోవడం లేదన్న భావనే.
ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు పార్టీ క్యాడర్ ను నిర్వీర్యం చేసేలా మారాయి. ప్రతి యాబై ఇళ్లకు ఓ వాలంటీర్ ను పెట్టి సర్వాధికారాలు ఆ వాలంటీర్ చేతిలో పెట్టారు. వారు వైసీపీ కార్యకర్తలని ప్రచారం జరిగినప్పటికీ… ఇతర సీనియర్ కార్యకర్తలు కూడా వారి ముందు తేలిపోయారు. దీంతో తమ పార్టీ అధికారంలోకి వచ్చినా చిన్న పని చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది.