ఎవరైనా బయట వాళ్లు సొంత రాష్ట్రం, సొంత రాజధానిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే.. బయట వాళ్లకి మన దాంతో ఏం పని .. వాళ్ల పని వాళ్లు చూసుకోవాలి అని అందరూ అనుకుంటారు. కానీ అదేం రోగమో కానీ ఏపీలో మాత్రం.. ఆ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వారిని సగం మంది నెత్తిన పెట్టుకుంటారు. ప్రభుత్వాన్ని తిడుతూ ఉంటారు. రేవంత్ రెడ్డి అమరావతి విషయంలో ఏపీకి లయబులిటీ అన్నారు. వాతావరణం మైనస్ అన్నారు. అంతే.. ఏపీ రాజధానిపై దాడి చేయడానికి ఇంత కంటే పెద్ద ఆయుధం లేదన్నట్లుగా రెచ్చిపోతున్నారు.
అమరావతి అనేది ఇప్పుడిప్పుడు పుట్టుకొచ్చిన ప్రాంతం కాదు. ఇప్పుడే దాన్ని వాస్కోడిగామా వచ్చి కనిపెట్టలేదు. అమరావతి భూమి పుట్టినప్పటి నుండి ఉంది. అక్కడ జనం కూడా ఉన్నారు. ఆ రెండు ప్రాంతాల్లో గుంటూరు, విజయవాడ అనే నగరాలు కూడా విస్తరించాయి. ఇప్పుడు దానికి రాజధాని అని పేరు మాత్రమే పెట్టారు. అంతే.. అక్కడేదో అమరావతి అంతరిక్షం నుంచి ఊడిపడిందని.. అది నివాస యోగ్యం కాదని ..ఉండటానికి కాదని.. భవనాలు కట్టలేరని.. పరిశ్రమలు రావని ఎవరో చెబితే అది నిజమని చెప్పి అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ నేతలకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దొరికాయి.
వైసీపీ నేతలకు అమరావతి అంటే వ్యతిరేకత ఉంది. అది అందరికీ తెలిసిన విషయం. మొదట అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఆ ప్రాంతాన్ని వల్లకాడు చేసే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు గొయ్యి తీసి పాతి పెట్టారు. అయినా అదే కుట్రలు.. అదే వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా.. ఇలా కుట్రలు చేయడం ..సొంత రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేయాలనుకోవడం క్షమించరాని నేరం. దురదృష్టవశాత్తూ వైసీపీ నేతలు పదే పదే అదే నేరం చేస్తున్నారు.