వైఎస్ఆర్ సీపీ శవ రాజకీయాలనే నమ్ముకుంటోంది. ఎక్కడ శవాలు దొరికినా అదే కారణం అని చెప్పి ఆ ఖాతాలో వేయడం.. సాక్షి పత్రికలో రాసుకోవడం తర్వాత వారి వద్దకు ఓదార్పు యాత్ర అంటూ జగన్ ఊరేగుతూ వెళ్లడం అనేది ఆ పార్టీ రాజకీయ వ్యూహం. ఇప్పటికీ అదే అమలు చేస్తున్నారు. ఇప్పుడు సాక్షి పత్రిక చూస్తే ఎక్కడ ఎవరు చనిపోయినా అక్రమ మద్యం వల్ల చనిపోయారని కథలు రాసేస్తున్నారు. ఇందు కోసం వైఎస్ చనిపోయినప్పటి ప్రణాళికలు అమలు చేస్తున్నారు.
నిరుపేదలు చనిపోతే తక్షణ సమాచారం సాక్షి ఆఫీస్కు !
సాక్షి జర్నలిస్టులందరికీ స్పష్టమైన సమాచారం ఇచ్చారు. నిరుపేదలు ఎక్కడైనా చనిపోతే.. వారి గురించి పూర్తి సమాచారంతో వెంటనే సాక్షి ఆఫీసుకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఆ మరణాలను అక్రమ మద్యం మరణాలుగా రాయాలని కూడా సూచించారు. ఇదే విధంగా ఆ జర్నలిస్టులు ప్రతి మరణాన్ని నమోదు చేస్తున్నారు. పత్రికల్లో రాస్తున్నారు. మద్యం వల్ల చనిపోకపోయినా అదే పని చేస్తున్నారు. ఇలా చనిపోతున్న వారి పేర్లతో అటు సాక్షి ఆఫీసులో.. ఇటు వైసీపీ ఆఫీసులో ఓ రిజిస్టర్ మెయిన్టెయిన్ చేస్తున్నారు. తప్పుడు వార్తలని కేసులు పెడుతున్నా తగ్గడం లేదు.
కల్తీ మద్యం కారణంగా చనిపోయారంటూ జగన్ ఓదార్పు యాత్ర ?
ఇప్పుడు ఈ చనిపోయిన వారి వద్దకు జగన్ రెడ్డి కల్తీ మద్యం వల్ల చనిపోయారంటూ ఓదార్పు యాత్ర చేయనున్నారు. వారు ఎవరూ కల్తీ మద్యం వల్ల చనిపోలేదు. సుదీర్ఘ అనారోగ్యం కారణంగా చనిపోయారు. అయినా జగన్ రెడ్డి శవ రాజకీయలకు అలాంటి పట్టింపులు ఉండవు. ఆఫ్రికా ఫార్ములాతో మద్యం తయారు చేసి ఆరేళ్ల పాటు జే బ్రాండ్లు అమ్మారు. ఇప్పుడు ఆ బ్రాండ్లు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. అలాంటి లిక్కర్ అమ్మి వేల మంది చావులకు కారణం అయిన వారే ఇప్పుడు పూర్తిగా బ్రాండెడ్ లిక్కర్ అందుబాటులోకి తెచ్చిన తర్వాత నకిలీ మద్యం అని రెచ్చిపోతున్నారు.
ఇది వైఎస్ చనిపోయినప్పటి ప్లానే !
వైసీపీ పునాదులు శవాలతో ముడిపడి ఉన్నాయని టీడీపీ నేతలు విమర్శిస్తూంటారు. దానికి సరైన కారణాలు ఉన్నాయి. శవాలతోనే ఆ పార్టీ ఎక్కువగా రాజకీయం చేస్తూంటుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాత్తుగా హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయినప్పుడు.. తర్వాత రోజు నుంచే ఆయన కోసం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారంటూ … ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకూ .. చనిపోయిన వాళ్ల పేర్లన్నీ నమోదు చేసుకోవడం ప్రారంభించారు. అది ఎందుకో చాలా మందికి అర్థం కాలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి సొంత పార్టీ పెట్టుకోవడానికి ఆ శవాలను వాడుకున్నారు. వారు వైఎస్ కోసం చనిపోయారని.. ఓదారుస్తానని రోజుల తరబడి ఊరేగింపులు చేస్తూ.. రాజకీయం చేశారు. అదే శవ రాజకీయం కోసం ఇప్పుడు నిరుపేదల శవాల్ని వాడుకుంటున్నారు.
రాజకీయాలు ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యపోయేలా జగన్ శవరాజకీయాలు ఉంటాయి. కాలం మారిందని.. అప్పటిలా కాదని.. పైగా ఆయన రాజకీయం ఏమిటో ప్రజలకు అర్థమైన తర్వాత కూడా ఇలాంటి రాజకీయాలు చేయాలనుకోవడమే ఆయన నైజం.