దుర్ఘటనలు జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ శవరాజకీయం జోరుగా చేస్తోంది. తప్పెవరిది అన్న దాన్ని పట్టించుకోకుండా.. చంద్రబాబే కారణం అని ఆరోపించడానికి రెడీగా ఉంటారు. వారి శవరాజకీయాల గురించి పక్కన పెడితే.. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందే. తప్పు ఎక్కడ జరిగిందో తేల్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి.
ప్రభుత్వ నిర్లక్ష్యం లేదని చెప్పలేం !
అప్పన్న చందనోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని తెలుసు. వైసీపీ హయాంలో భక్తులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ప్రభుత్వంలో అలాంటి సమస్యలు లేకుండా చూసేందుకు యంత్రాంగం ప్రయత్నించింది. కానీ అది డిజాస్టర్ గా మారింది. దానికి కారణం అతి జాగ్రత్తలు.. మొహమాటాలు. ఈ కారణంగానే ఎనిమిది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
వైసీపీ హయాంలో అవినీతి అధికారుల పెత్తనం
వైసీపీ హయాంలో అధికారులు పెత్తనం చేశారు. ఇప్పుడు వారిని మార్చలేదు. వారే అన్నీ పనులు చేశారు. చివరికి గోడ నిర్మాణ ఇంజినీరు.. రుషికొండ ప్యాలెస్ ఇంజినీరింగ్ అని చెబుతున్నారు. అదే నిజం అయితే అంత కంటే ఘోర తప్పిదం ఏముంటుంది?. కొండవాలులో పిల్లర్లు, కాంక్రీట్ లేకుండా సిమెంట్ బ్రిక్స్ తో గోడ నిర్మించాలని నిర్ణయించే ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని ఎలా అంచనా వేయగలం?. ఈ వ్యవహారంలో తప్పు ఎవరిది అయినా బయట పెట్టి శిక్షించకపోతే ప్రభుత్వ తప్పిదమే అవుతుంది.
కారణాలు కాదు.. ఘోరాలు జరగకుండా చూడాలి !
ప్రభుత్వాల బాధ్యత ఏదైనా పక్కాగా ఏర్పాట్లు చేయడం. వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి అధికారులు.. వైసీపీ హయాంలో అన్ని రకాల వ్యవస్థల పునాదుల్ని బలహీనం చేశారు. ఇప్పుడు వాటిని కనిపెట్టి బలోపేతం చేయకపోతే ఇలా ఒక్కొక్కటి విషాదాలు జరుగుతూనే ఉంటాయి. తప్పు వైసీపీదే అని రివర్స్ కౌంటర్ ఇవ్వవచ్చుకానీ..బాధ్యతల నుంచి తప్పించుకోలేరు.