ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారిశ్రామిక కళ మళ్ళీ కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రీన్ అమ్మోనియా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారీ ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. అయితే, ఈ పెట్టుబడులన్నీ తామే తెచ్చామంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాస్యాస్పదంగా మారింది. అధికారంలో ఉన్న ఐదేళ్లూ పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురిచేసి, ఇప్పుడు పెట్టుబడులు గ్రౌండింగ్ అవుతుంటే మా ఖాతా అని చెప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
గ్రీన్ కోను వేధించిన మాట నిజం కాదా?
గ్రీన్ కో ప్రాజెక్టు విషయంలో జగన్ రెడ్డి అనుసరించిన వైఖరి ఒక పెద్ద ఉదాహరణ. 2019లో అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ హయాంలో కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి మరీ, గ్రీన్ కో వంటి సంస్థలు టీడీపీతో కుమ్మక్కయ్యాయని, క్విడ్ ప్రో కో జరిగిందని తీవ్ర విమర్శలు చేశారు. విదేశీ రాయబారుల హెచ్చరికలను కూడా లెక్కచేయకుండా పీపీఏలను సమీక్షించి, పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీశారు. ఆ వేధింపుల తట్టుకోలేక అప్పట్లో అనేక కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోయిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు.
తెర వెనుక లాబీయింగ్ చేసుకుని మళ్లీ ఒప్పందాలు
ఒకవైపు గ్రీన్ కో ప్రాజెక్టులపై ఆరోపణలు చేసి, కోర్టుల చుట్టూ తిప్పిన జగన్ ప్రభుత్వం, ఆ తర్వాత అదే సంస్థతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు చేసుకుంది. కానీ, ఐదేళ్ల కాలంలో ఒక్క భారీ ప్రాజెక్టును కూడా గ్రౌండింగ్ చేయడంలో ఆ ప్రభుత్వం విజయం సాధించలేకపోయింది. కేవలం శంకుస్థాపనలకే పరిమితమై, రివర్స్ టెండరింగ్ పేరుతో అభివృద్ధిని రివర్స్ గేర్ వేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్లో భరోసా కల్పిస్తూ, ఆ ప్రాజెక్టులను వేగంగా కార్యరూపంలోకి తెస్తుంటే.. అది తన గొప్పతనమే అని జగన్ రెడ్డి చెప్పుకోవడం కామెడీ కాక మరేమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
పెట్టుబడులతో ఆటలాడి ఇప్పుడు క్రెడిట్ కోసం ఆరాటం
నిజానికి జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో పారిశ్రామిక వేత్తలను తరిమేయకుండా , అంతకుముందు ఉన్న ఒప్పందాలను గౌరవించి ఉంటే.. రాష్ట్రం ఇండస్ట్రియల్ హబ్‌గా ఎప్పుడో ఎదిగేది. కియా మోటార్స్‌ను కూడా నాడు ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలో ఏ చిన్న కంపెనీ వచ్చినా, ఏ ఒప్పందం గ్రౌండింగ్ అయినా అది తమ వల్లే అని వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం చూస్తుంటే, ప్రజలను ఇంకా అమాయకులుగా భావిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. అనుభవం లేని నిర్ణయాలతో రాష్ట్రాన్ని దశాబ్ద కాలం వెనక్కి నెట్టిన వారు, ఇప్పుడు క్రెడిట్ కోసం అర్రులు చాచడం వారిని చులకన చేస్తోంది. కానీ వారికి ఇంత కంటే మార్గం కనిపించడం లేదు.
