వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి చుట్టుముడుతున్నాయి. ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణంలో జ్యోతిష్యులు చెప్పినట్లుగానే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గంటల వ్యవధిలోనే తన తల్లి వైఎస్ విజయమ్మ నుండి ఊహించని షాక్ తగిలింది. తన కుమార్తె షర్మిలకు, ఆమె బిడ్డలకు ఆస్తి పంపకాల్లో జగన్ తీవ్ర అన్యాయం చేశారని, తండ్రి వైఎస్ఆర్ ఆశయానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని విజయమ్మ బహిరంగంగా నోటరీ చేసిన లేఖను విడుదల చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఒకప్పుడు కుటుంబం కోసం అంతా ఒకటే అన్నట్లుగా ఉన్న వైఎస్ ఫ్యామిలీలో ఇప్పుడు బయటపడ్డ ఈ విభేదాలు జగన్ ఇమేజ్ను బాగా దెబ్బతీశాయి.
డైవర్షన్ పాలిటిక్స్ కు తెర తీసిన వైసీపీ
సొంత తల్లి నుంచే తీవ్రమైన ఆరోపణలు రావడంతో విమర్శల పాలవుతున్న జగన్, ఈ సమస్య నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తన పాత వ్యూహమైన డైవర్షన్ పాలిటిక్స్ ను తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి రోజాను రంగంలోకి దింపారు. చంద్రబాబు నాయుడు, ఇతర కూటమి నేతలపై రోజా చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు కేవలం ఆస్తి వివాదంపై చర్చను పక్కదారి పట్టించేందుకేనని విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళా నేతల పట్ల అధికార ప్రభుత్వం కొంత మెతక వైఖరిని ప్రదర్శిస్తుండటాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని, రోజా తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు.
తిట్లకు సిద్ధపడని ఇతర సీనియర్ నేతలు
జగన్ అండ్ కంపెనీ ఆశించిన స్థాయిలో ఇతర నేతల నుండి మద్దతు లభించడం లేదు. గతంలో ఇలాంటి డైవర్షన్ రాజకీయాల్లో ముందుండే అంబటి రాంబాబు వంటి వారు ఇప్పటికే దెబ్బతిని ఉండటంతో వారు ముందుకు రావడం లేదు. ఇతర సీనియర్ నేతలు ఇప్పుడు మౌనం వహించడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబును బూతులు తిట్టించడం ద్వారా ప్రజల్లో తన ఆస్తుల వివాదం చర్చకు రాకుండా చూడవచ్చని జగన్ వ్యూహం పన్నినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. తిట్ల పురాణం వల్ల ఇప్పటికే పార్టీ ఇమేజ్ దారుణంగా దెబ్బతిన్నదని, మళ్లీ అదే బాటలో నడిస్తే ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తుందని చాలా మంది నేతలు భయపడుతున్నారు. ఇక కేసుల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఒత్తిడి ఉన్నప్పటికీ, జగన్ కోసం వ్యక్తిగత దూషణలకు దిగడానికి సీనియర్లు వెనకడుగు వేస్తున్నారు.
ఇంకెంత కాలం ఈ బూతుల వ్యూహం?
వైఎస్ విజయమ్మ ఆరోపణలు జగన్ రాజకీయ భవిష్యత్తుపై , వ్యక్తిత్వపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తాయి. తల్లిని, చెల్లిని కాదని ఆస్తుల కోసం పాకులాడుతున్నారనే ముద్ర పడటం వైసీపీ శ్రేణులను నైతికంగా బలహీనపరుస్తోంది. ఈ క్షుద్ర రాజకీయాల కాలం చెల్లిందని, కేవలం బూతులతోనో, డైవర్షన్ వ్యూహాలతోనో ఈసారి బయటపడటం అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు కూడా ఈ గిల్లీకజ్జాలను గమనిస్తుండటంతో, జగన్ తన వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.
