మాట్లాడితే సీబీఐ విచారణ కావాలంటున్నారు వైసీపీ నేతలు. నకిలీ మద్యంపై పెద్ద కుట్ర చేసి దొరికిపోతామని తెలియగానే రాష్ట్రం మొత్తం పార్టీనేతల్ని రంగంలోకి దింపి.. సీబీఐ విచారణ కావాలని డిమాండ్లు చేయించారు. ఓ వైపు ప్రతి మరణాన్ని నకిలీ మద్యం వల్లే అన్న పేరుతో ప్రచారం చేస్తున్నారు. కానీ సీబీఐకి ఇచ్చిన కేసుల్లో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు చూస్తే.. మళ్లీ ఎందుకు ఈ కేసులో సీబీఐ విచారణ అడుగుతున్నారని డౌట్ వస్తుంది.
వివేకా కేసులో సీబీఐకి ఇస్తే ఏం చేశారు?
వివేకా హత్య కేసులో జగన్ రెడ్డి .. సీబీఐ విచారణ కావాలని స్వయంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సునీత కూడా సీబీఐ విచారణ కావాలని పోరాడారు. జగన్ రెడ్డి కోరుకున్నట్లే సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించింది. సీబీఐ విచారణ జరుపుతూంటే నిద్రలేని రాత్రులు గడిపారు. చివరికి దర్యాప్తు అధికారులపై కేసులు పెట్టారు. సీబీఐ అంటే చంద్రబాబు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని నిందలు వేశారు. అయినా సరే మళ్లీ మళ్లీ ఇతర కేసుల్లో సీబీఐ కావాలని డిమాండ్ చేస్తున్నారు.
జగన్ అక్రమాస్తుల కేసు, కల్తీ నెయ్యి కేసులో ఎందుకు విమర్శలు చేస్తున్నారు ?
సీబీఐ విచారణ డిమాండ్ చేస్తున్నారంటే ఆ సంస్థపై నమ్మకం ఉండబట్టే. అంటే జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ చెబుతున్నదంతా నమ్ముతున్నట్లే అనుకోవాలి. వైసీపీ ఇలా జగన్ రెడ్డి ప్రజా ఆస్తులనుదోచుకున్నాడని ధృవీకరించడం పెద్ద విషయమే అనుకోవాలి. శ్రీవారి లడ్డూ ప్రసాదం కేసు సుప్రీంకోర్టు సీబీఐకి ఇస్తే.. ఆ సంస్థ చేసే దర్యాప్తుపైనా కోర్టులకు వెళ్లి అడ్డం పడుతున్నారు. ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ అనుకుని వారు ఇష్టం వచ్చినట్లుగా రాజకీయాలు చేస్తూంటారు. ఘోరాలు చేసి దొరికిపోయి సీబీఐ అనడం పరిపాటిగా మారింది.
ఇక బయటపడలేరు !
సీబీఐకి ఇస్తే.. ఎలాగోలా ఆలస్యం చేయవచ్చని.. దర్యాప్తు చేస్తే మళ్లీ రాజకీయ కుట్రలు అని నిందలు వేయవచ్చని వైసీపీ నేతల ప్లాన్. కానీ అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇలా వ్యవహరిస్తే.. అందరూ నవ్వుతారు. ఇప్పుడు వైసీపీ నేతలది అదే పరిస్థితి. వైసీపీ మార్క్ రాజకీయకుట్రలకు కాలం చెల్లింది.