ముఖ్యమంత్రి దృష్టిలో అన్ని నియోజక వర్గాలనూ ఒకేలా చూడాలి. ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. అయితే, తెలుగుదేశం సర్కారు వైఖరి ఇందుకు భిన్నంగా ఉందనే విమర్శలు మొదట్నుంచీ ఉన్నాయి. సొంత పార్టీ నాయకులు గెలిచిన నియోజక వర్గాలను ఒకలా… వైకాపా ఎమ్మెల్యేలున్న నియోజక వర్గాల విషయంలో మరోలా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. వైకాపా ఎమ్మెల్యేలకు అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదనీ, వారి నియోజక వర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను విడుదల చేయడం లేదనీ మొదట్నుంచీ వైకాపా గొంతు చించుకుంటోంది. వైకాపా ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించే పరిస్థితిని ఈ రకంగా క్రియేట్ చేస్తోందని అభిప్రాయం ఏర్పడింది. అయితే, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైకాపా ఇంతవరకూ విఫలమైందని చెప్పాలి. ఈ దిశగా తాజాగా వేసిన వ్యూహాత్మక ఎత్తుగడ ఫలించిందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
వైకాపా ఎమ్మెల్యేలందరూ ఒకేసారి వెలగపూడి వెళ్లారు. అయితే, ఒక్కొక్కరుగా సచివాలయానికి వెళ్లడం అనేది రొటీన్. కానీ, ఈసారి అందరూ ఒకేసారి వెళ్లడం వ్యూహాత్మకం. ముఖ్యమంత్రితోపాటు, రాష్ట్ర ఆర్థికమంత్రిని కలిసి తమ నియోజక వర్గాలకు నిధులు విడుదల చేయాలనీ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. వాస్తవ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. వాస్తవ పరిస్థితి ఏంటంటే… వైకాపా ఎమ్మెల్యేలు గెలిచిన నియోజక వర్గాల్లోని పనులన్నీ ఆయా జిల్లాల తెలుగుదేశం ఇన్ఛార్జ్ మంత్రులకే కేటాయిస్తున్నారు! వైకాపా ఎమ్మెల్యేలున్న నియోజక వర్గాల్లో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు కూడా తెలుగుదేశం ఆదేశాలను పాటించాల్సి వస్తోందని కూడా విమర్శలున్నాయి.
అయితే, ఈ పరిస్థితులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైకాపా వెలగపూడి యాత్ర చేపట్టింది. దీంతో మీడియా కూడా ఈ యాత్రను ప్రముఖంగానే కవర్ చేయాల్సి వచ్చింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ఎందుకు అభివృద్ధి పనులు జరగడం లేదనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైకాపా సక్సెస్ అయిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతోంది. తెలుగుదేశం సర్కారు తమను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేస్తోందో ఎస్టాబ్లిష్ చేయగలిగారు. వైకాపా నేతలున్న ప్రాంతాలకు చంద్రబాబు నిధులు ఇవ్వరు అనే విషయాన్ని ఈ యాత్ర ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా చేశారు. మరి, పరంపరను కొనసాగించేందుకు వైకాపా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుందో వేచి చూడాలి.