సోషల్ మీడియా యుగంలో వైసీపీ డ్రామా పాలిటిక్స్ నే నమ్ముకుంటోంది. విచిత్రమైన స్కెచులు వేసి ఇలా కూడా రాజకీయాలు చేయవచ్చా అని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. కొద్ది రోజుల కిందట ఓ డీఎస్పీ.. తిరుమల లడ్డూ కల్తీపై మాట్లాడారని చంద్రబాబు, పవన్, లోకేష్ పై ఫిర్యాదు చేశారు. ఓన్లీ సాక్షి.. అనుబంధ మీడియాను పిలిపించడంతోనే అసలు విషయం అందరికీ తెలిసిపోయింది. తాజాగా జాన్ అనే హెడ్ మాస్టర్ మధ్యాహ్న భోజన పథకంపై తప్పుడు ప్రచారం చేయించారు. చివరికి సస్పెండ్ అయ్యారు. ఈ రెండు ఘటనల్లోనూ తేలిందేమిటంటే… కంటెంట్ తయారు చేసుకుని పాలిటిక్స్ చేయడం.
బలిపశువుల్ని వెదుక్కుని బకరాలు
వైసీపీ రాజకీయ శైలిలో ఇటీవల స్టేజ్డ్ డ్రామాలు ఎక్కువయ్యాయి. ప్రజల్లో సహజంగా వచ్చే స్పందన కంటే సోషల్ మీడియాలో వైరల్ చేయడానికి వీలుగా కొన్ని సన్నివేశాలను సృష్టించడం ఆ పార్టీకి అలవాటుగా మారింది. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో ఒక డీఎస్పీ స్థాయి అధికారి ముఖ్యమంత్రి , ఉపముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేయడం వెనుక ఉన్న వ్యూహం అందరికీ అర్థమైపోయింది. కేవలం తమ అనుకూల మీడియాను మాత్రమే పిలిపించి ఆ ఫిర్యాదుకు విపరీతమైన ప్రచారం కల్పించడం ద్వారా అది ఒక రాజకీయ కంటెంట్ తయారీ పక్రియగా మారిపోయింది. తాజాగా మధ్యాహ్న భోజన పథకం విషయంలో ఒక హెడ్ మాస్టర్ ద్వారా చేయించిన ప్రచారం వైసీపీ సోషల్ మీడియా రాజకీయాలకు పరాకాష్టగా నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని తప్పుడు సమాచారంతో వీడియోలు సృష్టించడం చివరకు ఆ ఉపాధ్యాయుడు సస్పెండ్ కావడానికి దారితీసింది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఉద్యోగులను వ్యవస్థలను వాడుకోవడం వల్ల సదరు వ్యక్తుల భవిష్యత్తు నాశనం కావడమే కాకుండా పార్టీ పరువు కూడా బజారున పడుతోంది.
ప్రజల విజ్ఞతను తక్కువ అంచనా వేయడమే
ప్రస్తుత కాలంలో ప్రజల వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ప్రతి విషయాన్ని వారు వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నారు. ఏది నిజం ఏది అబద్ధం అనే విషయాన్ని క్షణాల్లో పసిగడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఫేక్ వీడియోలు నకిలీ ఫిర్యాదులతో రాజకీయాలు చేయవచ్చని అనుకోవడం వైసీపీ నాయకత్వ అమాయకత్వమే అవుతుంది. ఒక అబద్ధాన్ని వంద సార్లు చెబితే నిజం అవుతుందనే పాత సిద్ధాంతం ఇప్పుడు పని చేయదు. నిజాయితీ లేని రాజకీయం ఎంతో కాలం నిలబడదు అనే విషయాన్ని గత ఎన్నికల ఫలితాలు నిరూపించినా వైసీపీ తన పద్ధతిని మార్చుకోకపోవడం విచారకరం. రాజకీయం అంటే ప్రజల సమస్యలపై పోరాడటం ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం. కానీ వైసీపీ మాత్రం కేవలం సోషల్ మీడియా కంటెంట్ సృష్టిలోనే మునిగిపోయింది. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవ్వడం కంటే గ్రాఫిక్స్ వీడియోలు ఎడిటింగ్ చేసిన క్లిప్పింగులతో కాలక్షేపం చేస్తోంది. దీనివల్ల పార్టీకి గ్రౌండ్ లెవల్ లో పట్టు తగ్గుతోంది.
విశ్వసనీయత కోల్పోతున్న వైసీపీ
నిజమైన ప్రజా సమస్యలను వదిలేసి ఇలాంటి డ్రామాలను నమ్ముకోవడం వల్ల ప్రజలు ఆ పార్టీని మరింత దూరం పెట్టే అవకాశం ఉంది. నిరంతరం అబద్ధాలను ప్రచారం చేయడం వల్ల వైసీపీ మీడియా, సోషల్ మీడియా వింగ్ తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయింది. వారు చెప్పే నిజాలను కూడా ప్రజలు అనుమానించే పరిస్థితి ఏర్పడింది. ఒక పార్టీకి సోషల్ మీడియా అనేది ఒక బలం కావాలి కానీ అది ఒక అబద్ధాల ఫ్యాక్టరీగా మారకూడదు. ఇప్పటికైనా వైసీపీ నాయకత్వం ఈ డ్రామా పాలిటిక్స్ ను పక్కన పెట్టి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రాజకీయం చేయాలి. లేకపోతే ప్రజల నుంచి శాశ్వతంగా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది.


