వైసీపీ నేతలు జమిలీ కలలు కంటున్నారు. అది కూడా 2027 లోనే వచ్చేస్తాయని అంటున్నారు. నిజంగా వారు నమ్ముతున్నారో లేదో కానీ తమ క్యాడర్ ను నమ్మించేందుకు మాత్రం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఇంకేముంది.. ఐదేళ్లే..కళ్లు మూసుకుంటే ఎన్నికలు వస్తాయని జగన్ రెడ్డి చెప్పేవారు. కళ్లు మూసుకుంటే ఏడాది అయిపోయిందని ఇప్పటికి సంతృప్తి చెందుతున్నారు. అయితే కొంత మందికి మెలకువ వచ్చేసి మళ్లీ నిద్రపట్టడం లేదేమో కానీ.. జమిలీ ఎన్నికల జపం చేస్తున్నారు.
ఏపీలో జరుగుతోంది జమిలీ ఎన్నికలేగా ?
ఆంధ్రప్రదేశ్ లో జమిలీ ఎన్నికలే జరుగుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకే సారి జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు ఈ అంశంపై స్పష్టత ఉంది. వైసీపీ నేతలకు ఉందో లేదో తెలియదు. కానీ జమిలీ ఎన్నికలు 2027లో వస్తాయని చెప్పుకుంటున్నారు. అలా వస్తాయన్నదానికి చిన్న హింట్ ఏమైనా వారు తమ పార్టీ కార్యకర్తలకు చెప్పగలరా అంటే.. అవకాశమే లేదు. ఆ విషయం వైసీపీ నేతలకూ తెలుసు. ఎందుకంటే.. ముందే ఎన్నికలు నిర్వహించాలంటే కేంద్ర ప్రభుత్వం కాలపరిమితిని కూడా తగ్గించాల్సి ఉంటుంది. అది సాధ్యమేనా ?
జమిలీ ఎన్నికలు జరుగుతాయి..2029లో !
కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలపై సీరియస్ గాఉంది. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అనే తమ విధానాన్ని గట్టిగా అమలు చేయాలనుకుంటోంది. అయితే హడావుడిగా కాదు. పక్కా ప్రణాళికతో అమలు చేయాలనుకుంటోంది. దేశం అంతా ఒకే సారి వన్ ఎలక్షన్ పెట్టడం సాధ్యం కాదని ఓ అభిప్రాయానికి వచ్చింది. మొదటగా.. 2029 పార్లమెంట్ ఎన్నికల నాటికి సగం రాష్ట్రాల్లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు. ఎన్నికలకు ఆరు నెలలకు అటుగా..ఇటుగా..ఉన్న రాష్ట్రాలకు కలుపుకుంటే సగం రాష్ట్రాలు అయిపోతాయి. ఆ తర్వాత ఎన్నికల నాటికి అన్ని రాష్ట్రాలను కలుపుకుని జమిలీ ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలో ఎప్పుడూ ముందస్తుగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన లేదు. కానీ వైసీపీ నేతలు ఆశలకు పోతున్నారు.
జమిలీ వస్తే ప్రతిపక్ష హోదా వస్తుందన్న ఆశ?
పదకొండు సీట్లకు పరిమితమైన వైసీపీ.. ప్రతిపక్ష హోదా కోసం పరితపించిపోతోంది. ముందస్తుగా జమిలీ వస్తే అది అయినా వస్తుందని ఆశపడుతున్నారు. కానీ ఉన్న సీట్లు ఉడిపోతాయన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. పరిస్థితులు ఏమీ బాగోలేవని వైసీపీ నేతలకూ తెలుసు. అందుకే క్యూ ఆర్ కోడ్ ల పేరుతో పిలుపునిచ్చినా ఒక్కరూ బయటకు రావడం లేదు. ముఖ్య నేతలు ప్రెస్మీట్లకు పరిమితమవుతున్నారు. క్యాడర్ ఎవరి పని వారు చేసుకుంటున్నారు. వారిలో ఆశలు రేపుదామని ముందస్తు జమిలీ అంటున్నారు.