కూకట్ పల్లి రివ్యూ : టీఆర్ఎస్ , వైసీపీ దోస్తానా టీడీపీకి చెక్ పెడుతుందా..?

నందమూరి వెంకట సుహాసిని డాటరాఫ్ హరికృష్ణ పోటీ చేస్తున్న కూకట్ పల్లి నియోజకవర్గంపై… రెండు రాష్ట్రాల ప్రజల చూపు ఉంది. తమకు కంచుకోటగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సుహాసినిని భారీ మెజార్టీతో గెలిపించాలన్న పట్టుదలతో టీడీపీ అగ్రనేతలు ఇప్పటికే… తుది ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు సుహాసిని రోజువారీ పాదయాత్రలో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆమె కోసం… ఎన్టీఆర్ కుటుంబసభ్యులు వరుసగా ప్రచారంలోకి వస్తున్నారు. చివరి ఐదు రోజులు మరింత హోరెత్తించనున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన మాధవరం కృష్ణారావు ఈ సారి టీఆర్ఎస్ తరపున బరిలో ఉన్నారు. ఈయన దగ్గరి బంధువు మాధవరం కాంతారావు బీజేపీ తరపున బరిలో ఉన్నారు.

పేరుకు కూకట్ పల్లి అయినప్పటికీ.. నియోజకర్గం మొత్తం కూకట్ పల్లి మాత్రమే కాదు. బాలానగర్‌, మూసాపేట కూడా… ఈ నియోజకవర్గం కిందకే వస్తాయి. ఈ నియోజకవర్గంలో 3.37 లక్షల మంది ఓటర్లు ఉంటే వారిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన స్థిరపడిన వారే. వీరిలో అరవై శాతం మంది ఉత్తరాంధ్ర ప్రజలు ఉన్నారు. కమ్మ సామాజికవర్గం ఓట్లు ఎక్కువే ఉన్నాయి. తెలంగాణ ప్రాంత ప్రజల ఓట్లూ భారీగానే ఉన్నాయి. గత ఎన్నికల్లో… టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన గొట్టిముక్కల పద్మారావు రెండో స్థానంలో నిలిచారు. ఆయనకు.. యాభై వేలకుపైగా ఓట్లు వచ్చాయి. అయితే తెలుగుదేశం పార్టీ.. ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన ఏకైక టీపీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి.. వ్యవహారాలను సమన్వయం చేసుకుంటున్నారు. వరుసగా పార్టీలో చేరికల్ని ప్రొత్సహిస్తున్నారు. టీఆర్ఎస్ ఇన్చార్జ్ గొట్టిముక్కల పద్మారావు పార్టీలో చేరడం అదనపు బలం. ఇటీవలి పరిణామాలతో టీఆర్ఎస్ బేస్ ఓటు బ్యాంక్ మారింది.

తెలంగాణలో మొత్తం పరిస్థితి సంగతేమో కానీ… కూకట్ పల్లిలో మాత్రం… వైసీపీ నేతలు..నేరుగా… టీఆర్ఎస్ కు మద్దతు పలికారు. ప్రత్యేకంగా సమావేశం పెట్టి.. జై జగన్, జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. దాంతో.. కూకట్ పల్లిలో పోటీ ఆసక్తికరంగా మారింది. వైసీపీకి మద్దతుగా నిలిచే.. ఏపీకి చెందిన రెడ్డి సామాజికవర్గం ఓట్లన్నింటినీ… టీఆర్ఎస్ కు వేయించేలా.. ఇప్పటికే పకడ్బందీ స్కెచ్ రూపొందించారని చెబుతున్నారు. అదే సమయంలో… టీడీపీకి వ్యతిరేకంగా మరికొన్ని సామాజికవర్గాలను కూడా… ఎగదోస్తున్నారు. పవన్ కల్యాణ్ … టీడీపీని విపరీతంగా విమర్శిస్తున్నారు కాబట్టి కాపు సామాజికవర్గం.. అలాగే బ్రాహ్మణ వర్గం కూడా.. టీడీపీకి వ్యతిరేకంగా ఉందని ప్రచారం చేస్తున్నారు. ఇలా… టీడీపీపై సోషల్ ఇంజినీరింగ్ పేరుతో… వైసీపీ నేతృత్వంలో ఎటాక్ జరుగుతోంది.

అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఉత్తరాంధ్ర ఓటర్లే.. కీలకం.. వారు ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా.. టీడీపీ వైపే ఉంటారని చెబుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన 24 కులాలను.. కేసీఆర్ సీఎం అయిన వెంటనే బీసీ జాబితా నుంచి తొలగించారు. తెలంగాణలో ఆ కులాలు లేవనేది వారి వాదన. వారిని మళ్లీ… కలుపేలా చేస్తామని… మాధవరం హామీ ఇస్తున్నారు కానీ… చేయించలేదు. కానీ… టీడీపీ ఈ విషయం మానిఫెస్టోలో పెట్టింది. ఇది కూడా టీడీపీకి ప్లస్ కానుంది. కూకట్ పల్లిలో ఓ రకంగా ఆంధ్రా రాజకీయం కనిపిస్తోంది. గెలుపెవరిదనేది.. ఏపీ రాజకీయాలపైనా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com