ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కోర్టుల నుంచి క్లీన్ చిట్ పొంది, సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత పారదర్శకంగా పూర్తి చేసిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై వైసీపీ ఏడాది తర్వాత నిరంతరాయంగా అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. పేపర్ లీక్ అయింది.. అక్రమాలు జరిగాయి.. ఉద్యోగుల జాబితా ఆన్లైన్లో లేదు అంటూ ఆధారాలు లేని ఆరోపణలతో ప్రజలను, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని తమ కోర్ ఓటు బ్యాంక్‌ను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా వైసీపీ సోషల్ మీడియా, అనుకూల మీడియా ప్రచారానికి తెరలేపాయి. వాస్తవాలు పరిశీలించకుండా, ప్రభుత్వంపై బురదజల్లి రాజకీయంగా లబ్ధి పొందాలనే తాపత్రయం ఈ ప్రచారాల వెనుక స్పష్టంగా కనిపిస్తోంది.
‘బ్రిడ్జ్’ క్రీడపై పేకాట కలరింగ్!
వైసీపీ ప్రచారాల్లో అత్యంత హాస్యాస్పదమైన అంశం.. స్పోర్ట్స్ కోటాపై చేసిన తప్పుడు ప్రచారం. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన 65 క్రీడాంశాల జాబితాలో ‘బ్రిడ్జ్’ అనే మైండ్ గేమ్ కూడా ఒకటి. నియమ నిబంధనల ప్రకారం క్రీడా కోటా కింద దీనికి కూడా పోస్టులు కేటాయించాల్సి ఉండటంతో నోటిఫికేషన్లో పొందుపరిచారు. అయితే, దీనికి అర్హులైన ఆటగాళ్లు ఎవరూ లేకపోవడంతో ఆ పోస్టులను ఎవరికీ కేటాయించలేదు. కానీ, ఈ అంతర్జాతీయ క్రీడను సాధారణ ‘పేకాట’గా చిత్రీకరించి.. పేకాట ఆడేవారికి కూటమి ప్రభుత్వం టీచర్ ఉద్యోగాలు ఇచ్చేస్తోందంటూ వైసీపీ నేతలు చేసిన ప్రచారం వారి అవగాహనారాహిత్యాన్ని, కుట్రపూరిత వైఖరిని బయటపెట్టింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు సైతం నియామకాలన్నీ ఆన్లైన్ లో, జిల్లాల వారీగా పారదర్శకంగా అందుబాటులో ఉంచామని స్పష్టం చేసినా ప్రతిపక్షం బ్లేమ్ గేమ్‌ను ఆపకపోవడం గమనార్హం.
యువగళంలో పాల్గొన్న వారికి ఉద్యోగం రాకూడదా?
నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న ఒక అభ్యర్థికి డీఎస్సీలో ఉద్యోగం వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. గతంలో సాక్షి టీవీ వేదికగా కూటమి ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ను తీవ్రంగా కించపరుస్తూ, అసభ్య పదజాలంతో విమర్శలు చేసిన ఒక అభ్యర్థికి మెరిట్ ప్రాతిపదికన డీఎస్సీలో టీచర్ ఉద్యోగం లభించింది. విమర్శించిన వారికైనా సరే.. ప్రతిభ ఉంటే ఉద్యోగం వస్తుందని, ఇక్కడ ఎలాంటి రాజకీయ జోక్యం లేదని ఈ ఒక్క ఉదాహరణతోనే నిరూపితమైంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగిందని, స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థులు సైతం తాము కష్టపడి సాధించుకున్న ఉద్యోగాలపై అపోహలు సృష్టించవద్దని స్వచ్ఛందంగా వీడియోలు విడుదల చేస్తున్నారు.
సొంత కేడర్‌ను భ్రమల్లో ఉంచే వ్యూహం ఫలించేనా?
వాస్తవాలు ఇంత స్పష్టంగా కళ్లముందు కనిపిస్తున్నా, వైసీపీ మాత్రం పాత పద్ధతిలోనే అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తోంది. విద్యావంతులు, యువత సోషల్ మీడియా ద్వారా వాస్తవాలను ఇట్టే గ్రహిస్తున్నప్పటికీ.. సమాచార విశ్లేషణ లేని, అమాయకపు కోర్ ఓటు బ్యాంక్‌ను మళ్లీ నమ్మించి తమ వైపు తిప్పుకోవడానికే ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది చెబితే అది నమ్ముతారు అనే చులకన భావనతో సొంత ఓటర్లను సైతం మోసం చేయాలని చూడటం ఆ పార్టీకే రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే అధికారులు పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచారు కూడా.
