కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి హత్యకు రౌడీషీటర్లు కుట్ర పన్నిన వీడియో వెలుగులోకి రావడంతో వైసీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారు. మాకు తెలియదు..మాకు తెలియదు అన్నట్లుగా స్పందిస్తున్నారు. సాక్షి మీడియాలో ఏకంగా డ్రామా అని తీర్మానించి రాసేసారు. అలా రాయాల్సిన అవసరం ఏమి వచ్చింది..? దొరికిన వాళ్లంతా కోటంరెడ్డి అనుచురులే అని కూడా తీర్మానించింది. సాక్షి స్పందన చూస్తే.. తాము ఎక్కడ దొరికిపోతామో అన్న భయంతో… రాసినట్లుగా ఉంది.
వివిధ కేసులతో జైలుకెళ్లి ఇటీవల బయటకు వచ్చిన కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా వెంటనే తెరపైకి వచ్చారు. నెల్లూరు రూరల్ ఆయన నియోజకవర్గం కాదు. అయినా సరే.. కోటంరెడ్డి మీద ఎవరూ మర్డర్ ప్లాన్ చేయలేదని చెప్పడానికి తాపత్రయపడ్డారు. పెరోల్ అంశం పై దృష్టి మరల్చడానికే వీడియో అని చెప్పుకొచ్చారు. పెరోల్ అంశంలో దృష్టి మరల్చడానికి ఏమీలేదు. ఆయన సిఫారసు లేఖపై సంతకం చేశానని ఒప్పుకున్నారు కూడా. మరి ఎందుకు ఆయన కంగారు పడుతున్నారు ?
ఈ అంశంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా స్పందించారు. పోలీసులకు మూడు రోజుల ముందుగానే తెలిసినా తనను అప్రమత్తం చేయలేదన్నారు. తనను చంపితే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని మాట్లాడుకున్నారని.. ఎవరు డబ్బులు ఇస్తామన్నారో కూడా పోలీసులు దర్యాప్తు చేయాలని కోరారు. వైసీపీ నేతలు .. తన సోదరుడిపై ఆరోపణలు చేస్తున్నారని.. తమ కుటుంబం అలాంటిది కాదని వాదించారు. ఇలాంటి వాటికి తాను భయపడే ప్రసక్తే లేదన్నారు.
నిజంగా వైసీపీకి సంబంధం ఉందో లేదో కానీ.. ఇలాంటి వ్యవహారాల్లో అడ్డగోలు కథలు చెప్పి.. తమపై అనుమానం వచ్చేలా చేసుకోవడంలో వైసీపీ నేతలు ముందు ఉంటారని మరోసారి నిరూపించుకున్నారు.