అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల సామర్థ్యాన్ని కోట్లతో కొలుస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుకు.. మరో నియోజకవర్గం ఇన్చార్జ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సారి నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గ ఇన్చార్జ్ నవీన్ నిశ్చల్ పై గురి పెట్టారు. ఆయనను పదవి నుంచి తీసేస్తున్నామని సమాచారం పంపారు. గత ఎన్నికల్లో పోటీ చేసి నందమూరి బాలకృష్ణకు గట్టి పోటీ ఇచ్చిన ఆయన ఈ సారి.. ఎలాగైనా .. గెలవాలన్న లక్ష్యంతో నాలుగేళ్లుగా పని చేసుకుంటున్నారు. ముఖ్య అనుచరులతో ఆయన సమావేశమై… ఇంచార్జి పదవి నుంచి తప్పిస్తున్నట్లు జగన్ చెప్పిన విషయాన్ని .. వారికి చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. ఇంత కాలం పని చేయించుకుని ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు కోట్లు ఇస్తామన్నా అంగీకరించడం లేదన్నారు. ఎంత వరకు న్యాయమని.. తన అనుచరులతో వ్యాఖ్యానించారు.
ఆయన అనుచరలతో ఆవేదన వ్యక్తం చేసి ఏడుస్తున్న వీడియో ఇప్పుడు.. ఆన్ లైన్ లో వైరల్ అయిపోయింది. నాలుగేళ్ల కాలంలో పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టి పని చేసుకున్నానని.. కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చానని.. అయితే ఇప్పుడు జగన్ .. ఇతర ప్రాంతాల నుంచి ఓ మైనార్టీ నాయకుడ్ని తెచ్చి తనకు అన్యాయం చేస్తున్నారని.. ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందూపురంలో మైనార్టీలంతా తన వైపే ఉన్నారని.. పార్టీలో న్యాయం జరగకపోతే.. పోరాడుతానని ప్రకటించారు. నవీన్ నిశ్చల్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడు. 2004లో కాంగ్రెస్ తరపున టిక్కెట్ ఇచ్చి ప్రొత్సహించారు. అయితే ఆ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ గాలి వీచినా ఆయన ఏడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2009లో టిక్కెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి.. టీడీపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. గత ఎన్నికల్లో బాలకృష్ణపైనా వైసీపీ తరపున పోటీ చేశారు. కానీ ఈ సారి మాత్రం జగన్ టిక్కెట్ ఇవ్వకూడదని నిర్ణయించారు. హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత మరో పార్టీ విజయం సాధించలేదు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇటీవలి కాలంలో ఇలా ఆర్థిక కారణాలతో సమన్వయకర్తల జాబితా నుంచి తొలగించిన వారి జాబితా ఇరవైకి పైగానే ఉంటుంది. వీరంతా.. జగన్ అంటే అభిమానం ఉన్న వారే. పార్టీని కనిపెట్టుకుని ఉన్నవారే. అయినప్పటికీ.. జగన్ ఎవరు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారో.. వారికే టిక్కెట్లు అన్న విధానాన్ని పాటిస్తున్నారు. చిలుకలూరిపేటలో మర్రి రాజశేఖర్ అనే నేత దగ్గనుంచి ప్రారంభించి.. ఇప్పుడు హిందూపురం నవీన్ నిశ్చల్ వరకూ ఇది సాగతుంది.. ఇంక ముందూ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొసమెరుపేమిటంటే .. కొద్ది రోజుల కిందట టూట్యూబ్ చానళ్లకు ఇంటర్యూలు ఇచ్చిన నవీన్ నిశ్చల్ ఈ సారి బాలకృష్ణను ఓడించకపోతే.. అరగుండు కొట్టించుకుంటానని సవాల్ చేశారు. ఇది అప్పట్లో వైరల్ అయింది. ఇప్పుడు ఓటమి వరకూ అవసరం లేదని.. ముందే జగన్ అరగుండు కొట్టేశారని.. టీడీపీ కార్యకర్తలు సెటైర్లు వేస్తున్నారు.