వైసీపీ అధినేత జగన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ కాన్సెప్ట్ సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్‌కు గురవ్వడంతో, ఆ డ్యామేజీని కంట్రోల్ చేసేందుకు వైసీపీ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ మావిగన్ నవ్వుల పాలు కావడాన్ని ప్రజలు మర్చిపోయేలా చేయడానికి భారీగా నిధులు వెచ్చించి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లను రంగంలోకి దింపింది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌తో ఎలాంటి సంబంధం లేని, ట్విట్టర్ , ఇన్‌స్టాగ్రామ్‌లో కాస్త ఫాలోయింగ్ ఉన్న వారిని ఇన్ ఫ్లూయన్సర్లకు సుపారీ ఇచ్చి అమరావతిపై నెగిటివ్ వీడియోలు చేయిస్తున్నారు. ఈ ఇన్ ఫ్లూయన్సర్లు చేస్తున్న వీడియోల్లో లాజిక్కులు చూస్తుంటే సామాన్య నెటిజన్లకు కూడా నవ్వు వస్తోంది. అమరావతికి లక్షల కోట్లు ఖర్చు చేయాలి.. కానీ ప్రభుత్వం కొంతే ఖర్చు చేస్తోంది.. ఇది ఎప్పటికి పూర్తవుతుంది అంటూ వింత వాదనలు తెరపైకి తెస్తున్నారు. అమరావతిలో సరైన ట్రాన్స్ పోర్టు లేదని కొందరు వీడియోలు చేస్తున్నారు. మరికొందరైతే ఒకడుగు ముందుకేసి మావిగన్ వెనుక ఏదో మాస్టర్ ప్లాన్ ఉందని, అది ఏపీ భవిష్యత్తును మార్చేస్తుందని బిల్డప్ ఇస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియకుండా, కేవలం పార్టీ ఇచ్చిన స్క్రిప్టును చదువుతూ అమరావతిని తక్కువ చేసి చూపే ఈ ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద కామెడీగా మారింది.
ప్రస్తుతం అధికారంలో లేకపోయినా వైసీపీకి నిధుల కొరత లేకపోవడంతో, ఈ ఇన్ ఫ్లూయన్సర్ల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఒక్కో వీడియోకు, ఒక్కో పోస్టుకు ఇన్ ఫ్లూయన్సర్లు డిమాండ్ చేస్తున్న బిల్లులు తడిసి మోపెడవుతున్నా, పార్టీ మాత్రం వెనకాడటం లేదు. అయితే, ఇలా డబ్బులిచ్చి చేయించే కృత్రిమ ప్రచారం వల్ల ఉపయోగం ఉండకపోగా, ప్రజల్లో వైసీపీ తీరుపై మరింత విరక్తి కలుగుతోంది. వాస్తవాలను వక్రీకరించి, బయటి వ్యక్తులతో సొంత రాష్ట్ర రాజధానిని తిట్టించడం ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గతంలో ఇన్ ఫ్లూయన్సర్ల మాటలను ప్రజలు కొంతవరకు నమ్మేవారు కానీ, ఇప్పుడు వారి అసలు రంగు బయటపడిపోయింది. ఎవరు డబ్బుల కోసం వీడియోలు చేస్తున్నారు, ఎవరి వెనుక ఏ పార్టీ ఉంది అనేది నెటిజన్లకు సులువుగా అర్థమైపోతోంది. ఒకవైపు అమరావతికి కేంద్రం చట్టబద్ధత వచ్చిన సమయంలో ఇలాంటి పెయిడ్ వీడియోలతో ప్రజలను మభ్యపెట్టాలని చూడటం వైసీపీకే రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది.