దేవదేవుడు శ్రీవేంకటేశ్వరుడితో వైసీపీ నేతలు రాజకీయ ఆటలు ఆడుతుతున్నారు. ఐదు సంవత్సరాల పాటు చేసిన మహాపచారాన్ని కప్పిపుచ్చుకునేందుకు రోజు రోజుకు దిగజారిపోతున్నారు. మరింతగా తిరుమలవాసిని కించ పరుస్తున్నారు. కల్తీ నెయ్యి అంశాన్ని డైవర్ట్ చేసేందుకు చేస్తున్న రాజకీయంలో భాగంగా ఈ రోజుఏకంగా శ్రీనివాసుడి ఫోటోలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. షూలు వేసుకుని ఇష్టానుసారంగా తీసుకు వచ్చి.. వాటిని తమ టేబుళ్లపై విసిరేశారు.
దేవుడి పట్ల వారు చూపిస్తున్న ఘోర అపరాచారంపై టీడీపీ,బీజేపీ, జనసేన సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్లపై వైసీపీ నేతలకు నమ్మకం లేకపోతే మాత్రం ఇలా అపచారానికి పాల్పడటం సరి కాదని మండిపడ్డారు. శ్రీనివాసుడి చిత్ర పటాలకు అవమానం జరుగుతున్నా.. సభలోకి వైసీపీకి చెందిన మండలి చైర్మన్ మోషేన్ రాజు అనుమతించారు. టీడీపీ సభ్యులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మోషేన్ రాజు వారు చేసింది తప్పేనని.. వారిని పిలిచి మాట్లాడతానని తెలిపారు.
ఓ దశలో వైసీపీ సభ్యుల తీరుపై పయ్యావుల కేశవ్ తీవ్ర అసహనంతో.. హెడ్ ఫోన్స్ తీసి విసిరికొట్టారు. వైసీపీ సభ్యులను పిలిచి దేవుడికి అపచారం చేసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. జగన్ ఆదేశాలతోనే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత సోము వీర్రాజు మండిపడ్డారు. వైసీపీ తక్షణం క్షమాపణ చెప్పాలని జనసేన నేత కందుల దుర్గేష్ డిమాండ్ చేశారు. వైసీపీ సభ్యులు విచక్షణ కోల్పోయి.. దేవుడితో ఇలా రాజకీయాలు చేయడంపై సామాన్య ప్రజల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది.
