అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డబుల్ గేమ్ ఆడుతోంది. ఓ వైపు అమరావతికి వ్యతిరేకం కాదంటారు. కానీ అనుకూలమని మాత్రం చెప్పరు. చంద్రబాబు ఊహాలకు మాత్రం వ్యతిరేకమంటారు. అంటే జగన్ బొత్సతో తిట్టించిన స్మశానం రాజధానిగా ఉండటం వారి పాలసీ కావొచ్చు. అదే విషయాన్ని వైసీపీ నేతలు గట్టిగా ప్రకటించుకోవాలి. అదే సమయంలో రైతులకు న్యాయం పేరుతో వారికి తీరని అన్యాయం చేసేందుకు కుట్ర పన్నుతోంది. ఐదేళ్ల పాటు రాజధానిని అడుగడుగునా అడ్డుకుని, రైతులకు నరకం చూపించిన ఆ పార్టీ.. ఇప్పుడు మళ్ళీ అదే రైతుల పేరు చెప్పి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం క్షుద్ర రాజకీయానికి పరాకాష్ట. అసెంబ్లీ తీర్మానం తర్వాత పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాబోతున్న తరుణంలో ఆ పార్టీ తన అభిప్రాయాన్ని చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.
రైతులకు న్యాయం అంటే.. అభివృద్ధిని ఆపడమా?
అసెంబ్లీలో తీర్మానానికి దూరంగా ఉండి.. పార్లమెంట్ లో బిల్లు వచ్చిన సమయంలో అమరావతి రైతులకు న్యాయం పేరుతో ఆ ప్రక్రియను జాప్యం చేయాలని బెంగళూరు కేంద్రంగా ప్లాన్ చేస్తున్నట్లుగా వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది. అసలు అమరావతి రైతులకు న్యాయం చేయడం అంటే ఏమిటో వైసీపీకి తెలుసా? గత ప్రభుత్వ హయాంలో భూములిచ్చిన రైతులను గాలికి వదిలేసి, వారిని రోడ్ల మీద నిలబెట్టి, పోలీస్ కేసులతో వేధించడమేనా న్యాయం? ఒక నగరం అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే అక్కడ భూములిచ్చిన రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుంది. ఆ ప్రాథమిక సత్యాన్ని విస్మరించి, మాస్టర్ ప్లాన్‌కు తూట్లు పొడుస్తూ ఇళ్ల పట్టాల పేరుతో రాజధాని ఆకృతిని దెబ్బతీసిన వారు.. నేడు రైతుల ప్రయోజనాల గురించి మాట్లాడటం. దెయ్యాలు వేదాలు వల్లించినట్లవుతోంది. అమరావతి అత్యున్నతంగా నిర్మితమైతేనే రైతులకు లాభం, అది ఇప్పుడు జరుగుతోంది. దాన్ని అడ్డుకోవాలని చూడటమే రైతులకు చేసే అసలైన అన్యాయం.
విషప్రచారం – విద్రోహ రాజకీయం
రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రతీకారానికే ప్రాధాన్యతనిచ్చే వైసీపీ, ఇప్పుడు రాష్ట్రం చేస్తున్న తీర్మానం.. కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లుపై కూడా తప్పుడు ప్రచారం చేయడం ఖాయం. రాజధానికి చట్టబద్ధత వస్తూంటే దాన్ని ఎలాగైనా ఆపాలనేది వారి అసలు ఉద్దేశం. పార్లమెంట్ సమావేశాలకు ముందు మిథున్ రెడ్డి పార్లమెంటులో ఈ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేయబోతున్నారని సంకేతాలు ఇచ్చారు. అలా చేయడం అంటే.. నేరుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడమే. ఐదేళ్ల కాలంలో ఒక్క ఇటుక కూడా వేయలేకపోయిన వీరు, ఇప్పుడు జరుగుతున్న నిర్మాణాలను చూసి సహించలేకపోతున్నారు. ఇది కేవలం అమరావతిపై దాడి కాదు, రాష్ట్ర భవిష్యత్తుపై జరుగుతున్న కుట్ర.
పాతాళంలోకి పడినా తెలుసుకోలేరా?
అమరావతిని నాశనం చేసేందుకు గతంలో జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. రైతుల ఆత్మవిశ్వాసం ముందు వారి అణచివేత పటాపంచలైంది. అప్పుడు చేసిన తప్పులకే ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. అయినా సరే, ఇంకా పాత పద్ధతుల్నే అనుసరిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటే, రాబోయే రోజుల్లో వైసీపీ అనే పార్టీకి ఆంధ్రప్రదేశ్ గడ్డపై ఉనికి లేకుండా పోవడం ఖాయం. అమరావతి అభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయి. రైతులకు న్యాయం జరగడం అంటే వారి త్యాగానికి ప్రతిఫలంగా ఒక ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించడమే. ఆ దిశగా అడుగులు పడుతుంటే, మధ్యలో అడ్డుపడే క్షుద్ర రాజకీయాలను ప్రజలు సహించబోరని గత ఎన్నికల్లోనే రుజువైంది.


