జగన్ పుట్టిన రోజు జరిగిపోయింది. కానీ వైసీపీ నేతలంతా ఇదేం దోపిడీ మామా అని మనసులో తిట్టుకుంటున్నారు. ఎందుకంటే వారిని సాక్షి టీవీ, సాక్షి పేపర్ .. సాక్షి డిజిటల్ మీడియా అలా దోపిడీ చేసేశాయి మరి. సాక్షికి ప్రకటనలు ఇస్తేనే జగన్ పై, వైసీపీపై అభిమానం ఉన్నట్లుగా అని మార్కెటింగ్ టీమ్ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసింది. పార్టీ పెద్దలకు తెలియకుండా ఇలా చేయరు. పార్టీ నేతల్ని దోచేసుకోవాలని వారే సిగ్నల్ ఇచ్చారు. ఫలితంగా జగన్ పుట్టినరోజు పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లు చేయగలిగారు.
బ్లాక్ మెయిలింగ్తో బలవంతపు ప్రకటనలు
ప్రతి ఏటా జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, సానుభూతిపరుల వద్ద నుంచి ప్రకటనలు సేకరిస్తూ ఉంటారు. గతంలో అయితే అధికారంలో ఉన్నప్పుడు పదవులు పొందిన వారు తమ సంపాదనలో కప్పం కట్టినట్లుగా కొంత ప్రకటనలు ఇచ్చేవారు. ఈ సారి అధికారం లేదు. అందుకే పార్టీ నేతలను బ్లాక్ మెయిల్ చేశారు. జగన్ దృష్టిలో పడాలంటే.. దండిగా ప్రకటనలు ఇవ్వాలని లేకపోతే మీ వార్తలు పత్రికల్లో రావని బ్లాక్ మెయిలింగ్ చేశారు. అలా రెండు, మూడు నెలల నుంచి సాగిన మార్కెటింగ్ లో .. ప్రకటనలు, డబ్బులు దండుకున్నారు.
ప్రత్యేక ధరలు పట్టి మరీ పార్టీ నేతల్ని దోచేశారు
సాధారణంగా సాక్షి టీవీలో 10 సెకన్ల బర్త్డే స్లాట్ ధర రూ.2,500 ఉండగా, జగన్ పుట్టినరోజు వేళ దాన్ని ఏకంగా రూ. 6,000 కు పెంచారు. వివిధ ఫార్మాట్లలో ప్రకటనలు ఇస్తూ, అవి పదే పదే ప్రసారం కావాలంటే ఒక్కో నేత నుంచి దాదాపు రూ.10 లక్షలవరకు వసూలు చేశారు. ఇది అభిమానంతో చేసే చేసే ఖర్చు కాదు. సాక్షి మార్కెటింగ్ టీమ్ నుంచి వచ్చే ఒత్తిడి వల్ల చేస్తున్న బలవంతపు ఖర్చు. ఈ విషయాన్ని వారి మార్కెటింగ్ స్ట్రాటజీలోనే చెప్పుకుంటున్నారు.
ఎంత ఖర్చు చేస్తే.. అంత ప్రాధాన్యత
పార్టీ నేతలను ఆదాయవరనరుగా మార్చుకోవాలన్న లక్ష్యంతో ఇటీవల మార్కెటింగ్ స్ట్రాటజీ మార్చుకున్నారు. జిల్లాల్లోని పార్టీ ముఖ్యులకు సాక్షి మార్కెటింగ్ విభాగం టార్గెట్ గా పెట్టుకుంది. పెద్ద ఫోటో వేస్తేనే నాయకత్వం దృష్టిలో పడతారు , మంచి ప్రైమ్ టైమ్ స్లాట్ ఇస్తాం అంటూ బేరసారాలు సాగిస్తున్నారు. చివరికి వారికి ఇచ్చే ప్రమోషనల్ పాయింట్లలో జగన్ దృష్టిలో పడేలా కొన్ని బైట్లు ఉంటాయని చెబుతున్నారు. పార్టీలో గుర్తింపు పొందాలంటే నాయకత్వం పట్ల విధేయత, కష్టపడి పని చేయడం కాదు.. ఎంత పెద్ద ప్రకటన ఇచ్చారనేదే కొలమానంగా మారింది. చివరకు జిల్లాల వారీగా ప్రకటనల టార్గెట్లు కూడా విధిస్తున్నట్లు తెలుస్తోంది.
పార్టీ నేతల్నీ వదలరా?
జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ సాక్షి మీడియాను ప్రజాధనంతో పోషించారు. ఆ సంస్థలో పని చేసేవారికి చాలా మందికి ఔట్ సోర్సింగ్ పేరుతో జీతాలిచ్చారు. సాక్షి పత్రిక కొనిపించారు. వాలంటీర్లకు డబ్బులిచ్చి సాక్షి పత్రిక కొనిపించారు. ఇప్పుడు ఆ ఆదాయం లేదని పార్టీ నేతల్ని దోపిడీ చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడటం లేదు.
వ్యాపార రీత్యా డిమాండ్ ఉన్న రోజున ధరలు పెంచడం మీడియా రంగంలో సాధారణమే కావచ్చు. కానీ, పార్టీ అధినేత పుట్టినరోజునే ఆయన సొంత మీడియాలో, ఆయన పార్టీ నేతల నుంచి అధిక ధరలు వసూలు చేయడం నీతి మాలిన పని. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు అండగా ఉండాల్సింది పోయి వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం అంటే.. ఇంత కంటే ఘోరమైన మనస్థత్వం ఉన్న వారు ఎవరూ ఉండరేమో?
డబ్బులు కట్టలేని ద్వితీయశ్రేణి నేతల్లో అసంతృప్తి
గత ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ కోలుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో, ఇలాంటి వసూళ్ల పర్వం పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసహనాన్ని పెంచుతోంది. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం అనేది గౌరవపూర్వకమైన విషయం కావాలి కానీ, అది ఒక ఇన్వాయిస్ లాగా మార్చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే సాక్షి మీడియా పుట్టినరోజు శుభాకాంక్షలను ప్రసారం చేయ లేదు.. ఒక వసూళ్ల మాఫియాను నడిపింది. పాపం వైసీపీ లీడర్, క్యాడర్.
