వైసీపీలోని కాపు నేతలు అనుసరిస్తున్న తీరు ప్రస్తుతం వారి సామాజికవర్గంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అధికారం చేతిలో ఉన్నప్పుడు కులం గురించి పట్టించుకోని నేతలు, ఇప్పుడు పదవులు పోయాక కులం కార్డును తీసి ఐక్యంగా ఉన్న తమ సామాజికవర్గాన్ని చీల్చాలని అనుకుంటున్నారు. తద్వారా బలహీనం చేసి జగన్ రెడ్డిని బలపర్చాలనుకుంటున్నారు. అంబటి రాంబాబు వంటి నేతలు, గతంలో ఎన్నడూ తన సామాజికవర్గ సమస్యలపై గళం విప్పలేదు సరే కదా, కనీసం ఆ కుల నేతలను గౌరవించిన సందర్భాలు కూడా తక్కువే. కానీ, ఇప్పుడు తాను చేసిన నేరానికి జరిగిన ఒక చిన్న ఘటనను ఆసరాగా చేసుకుని, దానిని కులానికి ముడిపెట్టి యాత్రలు చేస్తున్నారు. తమ కులంలో విభజన తెస్తున్నారు.
కాపుల్ని పవన్ నుంచి దూరం చేయాలని టార్గెట్
రాష్ట్ర రాజకీయాల్లో కాపు సామాజికవర్గం దశాబ్దాలుగా రాజ్యాధికారం కోసం కలలు కంటోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రూపంలో ఆ సామాజికవర్గానికి ఒక బలమైన గుర్తింపు, ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన అధికారం దక్కాయి. ఒక రకంగా చెప్పాలంటే, కాపుల చిరకాల వాంఛ అయిన అధికార భాగస్వామ్యం ఇప్పుడు నెరవేరింది. ఇలాంటి తరుణంలో, మళ్ళీ కాపులను చీల్చి, వారిని బలహీనపరిచి తిరిగి జగన్ పాదాల చెంతకు చేర్చాలని చూడటం ఆ సామాజికవర్గ భవిష్యత్తును దెబ్బతీయడమే. వైసీపీ కాపు నేతలు చేస్తున్న ఈ ప్రయత్నం.. కాపుల కళ్లల్లో వారే పొడుస్తున్నట్లుగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
సొంత కులంలో చీలిక కోసమే వైసీపీ కాపు నేతల కుట్రలు
పవన్ కళ్యాణ్ పట్ల కాపు సమాజం ఏకతాటిపైకి వస్తుండటం చూసి ఓర్వలేకనే వైసీపీ ఈ చీలిక రాజతంత్రాన్ని ప్రయోగిస్తోంది. అంబటి రాంబాబు వంటి నేతలను అడ్డం పెట్టుకుని, మీడియా ఇంటర్వ్యూల ద్వారా విష ప్రచారం చేస్తూ కాపు యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది. అధికారం ఉన్నప్పుడు ఇచ్చిన కాపు రిజర్వేషన్ల అంశాన్ని తుంగలో తొక్కిన వీరు, ఇప్పుడు కుల ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. సామాజికవర్గాన్ని ముక్కలు చేయడం వల్ల నష్టపోయేది ఆ కులమే తప్ప, ఏసీ రూముల్లో కూర్చుని రాజకీయాలు చేసే ఈ నేతలు కాదు.
కొంచెమైన మనస్సాక్షి ఉండదా?
కాపు సమాజం ఇప్పుడు ఎంతో చైతన్యవంతంగా ఉంది. అధికారం తమ చేతిలోకి వచ్చిన వేళ, మళ్ళీ ఒకరి కింద బానిసలుగా ఉండేందుకు వారు సిద్ధంగా లేరన్న అభిప్రాయం వినిపిస్తోంది. వైసీపీ నేతలు చేస్తున్న ఈ కుట్రలను కాపు మేధావులు, యువత గమనిస్తూనే ఉంటారని.. స్వార్థ రాజకీయాల కోసం సొంత కులాన్నే పణంగా పెడుతున్న నేతలకు భవిష్యత్తులో ఆ సామాజికవర్గమే బుద్ధి చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేతలు కొంత అయినా తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలన్న సలహాలు వినిపిస్తున్నాయి.