‘రంగుల పిచ్చి’ జగన్‌దా?..వైకాపా నేతలదా?

ysrcp

‘పిచ్చి పిచ్చి పిచ్చి…రకరకాల పిచ్చి…ఏ పిచ్చీ లేకుంటే అది అచ్చమైన పిచ్చి’ ..అని పాత తెలుగు సినిమాలో ఓ పాట ఉంది. ఏపీలో వైకాపా తీరు ఇలాగే పిచ్చి పిచ్చిగా ఉంది. అదేనండీ…పార్టీ రంగుల పిచ్చి. కనబడ్డ ప్రతీ భవనానికి వైకాపా నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలోని రంగులు వేస్తున్నారు. ‘కాదేదీ కవితకనర్హం’ అన్నట్లుగా రంగులు ఫలాన భవనానికే వేయాలని వారికి రూలేం లేదు. వైకాపా వారు పంచాయతీ కార్యాలయ భవనాలు, శ్మశానాల ప్రవేశ ఆర్చీలు, మంచినీటి ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, ప్లాస్టిక్‌ క్యాన్లు, ఆలయాలకు పార్టీ రంగులు వేస్తున్నారు. ఇంతటితో వదల్లేదు. బర్రెల కొమ్ములకు కూడా పార్టీ రంగులు వేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, గాంధీజీ సహా నాయకుల విగ్రహాలకు (అవి పెట్టిన పీఠాలకు)..ఇలా అదీ ఇదీ అనే తేడా లేకుండా పార్టీ రంగులు వేసిపారేస్తున్నారు. ఈ పాడు పనికి ప్రభుత్వ డబ్బు ఖర్చు చేస్తున్నారో, పార్టీ డబ్బు ఖర్చు చేస్తున్నారో తెలియదు.

పార్టీ కార్యకర్తలు, అభిమానులు పార్టీ మీద, వైఎస్‌ఆర్‌, జగన్‌ మీద ప్రేమతో ఇలా రంగులు వేస్తున్నారని, ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయడంలేదని నాయకులు చెబుతున్నారు. ఏదో ఎక్కడో ఓ చోట, ఏదో ఊళ్లో వేశారంటే పొరపాటుగానో గ్రహపాటుగానో చేశారని అనుకోవచ్చు. కాని పరిస్థితి అలా లేదు. రంగులు వేయడాన్ని ఓ ఉద్యమంలా చేస్తున్నట్లుగా కనబడుతోంది. విశాఖపట్టణం జిల్లాలో కొత్తగా నిర్మించిన ఓ బాలికల హాస్టల్‌కు వైకాపా రంగులు వేశారు. జిల్లాపరిషత్‌ పాఠశాల ఆవరణలో ఈ భవనాన్ని రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ నిధులతో నిర్మించారు. దీనికి ప్రారంభోత్సవం కాకముందే వైకాపా రంగులు వేశారు.

ఇప్పటివరకు ఎప్పుడో నిర్మించిన పాత భవనాలకు, ఇతర నిర్మాణాలకు రంగులు వేస్తున్నారు. కాని ఇప్పుడు హాస్టల్‌ భవనం ప్రారంభం కాకముందే పార్టీ రంగులు వేశారంటే ఇది ఉద్దేశపూర్వకంగా, పనిగట్టుకొని వేశారని అర్థమవుతోంది. ఇది పార్టీ నాయకులకు తెలిసే జరుగుతోంది. పత్రికల్లో ఫోటోలు వస్తున్నాయి. టీవీలో కనబడుతున్నాయి. అయినప్పటికీ ఇదేమిటని అడిగేవారే లేరు. మంత్రులు సహా పార్టీ నాయకులంతా ఈ రంగులు చూసి ఆనందిస్తున్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి జగన్‌కు కూడా తెలిసేవుంటుంది. చిన్న చిన్న విషయాలకే స్పందిస్తున్న జగన్‌ రంగుల వార్తల గురించి తెలుసుకోకుండా ఉంటాడా? ఒకవేళ తెలిసినా తాను సంతోషించి ఊరుకొని ఉంటాడు. ఇదో విధమైన ప్రచార కార్యక్రమమే కదా.

అసలు ఇలా చేయండని ఆయన చెప్పినా ఆశ్చర్యం లేదు. పార్టీ రంగులు వేయడం మంచి పద్ధతి కాదని ఆయన అనుకొని ఉంటే ఇది ఎప్పుడో ఆగిపోయేది కదా. హైదరాబాదులో ఉన్న లోటస్‌పాండ్‌కో, బెంగళూరులో ఉన్న తన ఎస్టేట్‌కో పార్టీ రంగులు వేసుకుంటే అభ్యంతరం లేదు. కాని ప్రజాధనంతో కట్టిన భవనాలకు పార్టీ రంగులు వేయడమేంటీ? అది ప్రజల డబ్బు అనే సంగతి జగన్‌కు తెలియదా? ఇప్పటికే సంక్షేమ పథకాలకు తన తండ్రి పేరు, తన పేరు పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నాడు. ఇది చాలడంలేదేమో భవనాలకు రంగులు వేస్తున్నారు. మంచి ముఖ్యమంత్రి అంటే పథకాలకు పేర్లు పెట్టుకోవడమో, రంగులు వేయించడమో కాదు.

వైఎస్‌ జగన్‌ అనేక పథకాలు ప్రవేశపెట్టి జనాలకు మేలు చేస్తున్నందుకు వారు కృతజ్ఞతగా, సంతోషంతో రంగలు వేస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈమధ్య చెప్పాడు. మరి చంద్రబాబు హయాంలో అన్న క్యాంటీన్లకు పసుపు పచ్చ రంగు వేయలేదా? అని ప్రశ్నించాడు. వాళ్లు చేసింది ఒప్పు..మేం చేసింది తప్పా అన్నట్లుగా ఉంది ఈయన ధోరణి. రాజకీయ నాయకులు ఎప్పుడూ ఇంతే. వాళ్లు చేశారుగా తామెందుకు చేయకూడదని ప్రశ్నిస్తారు. గత పాలకులు తప్పులు చేస్తే వీరు చేయాలని రూలేమైనా ఉందేమో తెలియదు. రాష్ట్రంలో అవినీతి జరగకూడదంటూ జగన్‌ గొప్పగా మాట్లాడుతున్నాడు. పథకాలకు పేర్లు పెట్టుకోవడం, ఆలా రంగులు వేయించుకోవడం కూడా అవినీతేనని తెలుసుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com