జగన్ పై దాడి ఘటన దర్యాప్తు మీద రాష్ట్రప‌తి స్పందించార‌ట‌!

ప్ర‌తిప‌క్ష పార్టీ వైకాపా నేత‌లు మంగ‌ళ‌వారం సాయంత్రం ఢిల్లీలో రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ ను క‌లుసుకున్నారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద విశాఖప‌ట్నం విమానాశ్ర‌యంలో జ‌రిగిన కోడి క‌త్తి దాడి విష‌య‌మై రాష్ట్రప‌తికి వైకాపా నేత‌లు వివ‌రించారు. దాడి జ‌రిగిన తీరు, అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను ఆయ‌న‌కు చెప్పిన‌ట్టుగా నేత‌లు చెప్పారు. రాష్ట్రప‌తిని క‌లిసిన‌వారిలో మాజీ ఎంపీలు మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్‌, ఎంపీ విజ‌య‌సాయి రెడ్డితోపాటు సీనియ‌ర్ నేత ఉమారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు కూడా ఉన్నారు.

ఇంత‌కీ వారు రాష్ట్రప‌తిని క‌లిసింది ఎందుకంటే… కోడి క‌త్తి దాడి ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు కోసం! ఈ ఘ‌ట‌న‌పై నిష్పాక్షికంగా ద‌ర్యాప్తు జ‌ర‌గాలంటే థ‌ర్డ్ పార్టీతో కేసు విచార‌ణ చేయించాల‌ని వైకాపా నేతలు కోరారు. దీనిపై రాష్ట్రప‌తి సానుకూలంగా స్పందించార‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై మ‌రోసారి విమ‌ర్శ‌లు చేశారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధ‌మూ లేక‌పోతే, స్వ‌తంత్ర దర్యాప్తు సంస్థ‌తో ద‌ర్యాప్తున‌కు ముఖ్య‌మంత్రి ఎందుకు ఆదేశించ‌లేద‌ని ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి అన్నారు. జ‌గ‌న్ మీద హ‌త్యాయ‌త్నానికి ప్ర‌య‌త్నించింది ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడే అన‌డంలో సందేహం లేద‌ని మ‌రోసారి ఆరోపించారు. ఆయ‌న‌తోపాటు ఈ కుట్ర వెన‌క ఉన్న టీడీపీ నేత‌లంతా బ‌య‌ట‌ప‌డాలంటే రాష్ట్రప‌తి లేదా కోర్టు ఉత్త‌ర్వుల ద్వారా నిష్పాక్షిక ద‌ర్యాప్తు జ‌రగాల‌న్నారు.

తనపై దాడి ఘటనపై జరిగే దర్యాప్తునకు సహకరించనిది జగన్..! పోలీసుల‌పై న‌మ్మ‌కం లేద‌న్నారు. ఇప్పుడు అదే పోలీసుల భ‌ద్ర‌త‌లో పాద‌యాత్ర కొన‌సాగిస్తున్నారు! వాస్త‌వానికి, ఈ ఘ‌ట‌న‌పై మొద‌ట్నుంచీ టీడీపీని దోషిగా వేలెత్తే ప్ర‌య‌త్న‌మే వైకాపా చేస్తోంది. జ‌గ‌న్ ను హ‌త్య చేసేందుకు ముఖ్య‌మంత్రి కుట్ర చేశార‌ని ఏ ఆధారాల‌తో విజ‌యసాయి ఆరోపిస్తున‌ట్టు..? ఒక ముఖ్య‌మంత్రిపై కుట్ర ఆరోప‌ణ‌లు చేసే ముందు కొన్నైనా ఆధారాల‌తో మాట్లాడాలి క‌దా! వారి దృష్టిలో కేసు ద‌ర్యాప్తు అంటే… టీడీపీని దోషిగా చూసే కోణం నుంచి మాత్ర‌మే జ‌ర‌గాల‌న్న‌ది వారి డిమాండ్‌. అయితే, వారు కోరిన‌ట్టుగానే ద‌ర్యాప్తు అంశంపై రాష్ట్రప‌తి సానుకూలంగా స్పందించార‌ని కూడా వారే చెప్పేయడం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com