నమ్మేవాళ్లుండాలి కానీ వైసీపీ నేతలు ఏదైనా చెబుతారు. చివరికి రోడ్డు మీద జరిగే చిన్న ప్రమాదం కూడా.. లడ్డూ కల్తీని బయట పెట్టడం వల్లే జరిగిందని చెప్పేయగలరు. చెప్పడం ఏమిటి.. అదే చెబుతున్నారు కూడా. తన బార్లో కల్తీ మద్యం అమ్మీ.. తన బార్ ముందే కస్టమర్లు చనిపోయేలా చేసిన రికార్డు ఉన్న మల్లాది విష్ణు అనే పెద్ద మనిషి ప్రెస్మీట్ పెట్టి ఇదే పురాణం వినించారు. నెయ్యి కల్తీ ఆరోపణలు చేయడం వల్లే ఏపీలో ఎన్నో జరుగుతున్నాయట.
రోజువారీ జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. అన్నీంటినీ లడ్డూకు అన్వయిస్తున్నారు.. తమ తప్పేమీ లేదని చెప్పుకోవడానికి.. కల్తీ నెయ్యిపై మాట్లాడకుండా ఉండటానికి ఇదో అతి తెలివి ప్లాన్ అన్నమాట. ఒక్క మాల్లాది విష్ణు కాదు.. వైసీపీ నేతలంతా అంతే. భూమన కరుణాకర్ రెడ్డి అయితే మరో రేంజ్. ఆయన కల్తీ నెయ్యి అంశంపై స్వాములు మాట్లాడకుండా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
ఆధ్యాత్మిక గురువులు లడ్డూ అపవిత్రతపై నోరు విప్పకుండా చేసేందుకు వైకాపా నేతలు బెదిరింపు ధోరణిని అవలంబిస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన ఘోరాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వారిపై ఆరోపణలు చేస్తున్నారు భూమన. తమకు అనుకూలంగా ఉండేవారిని ప్రోత్సహిస్తూ, ధర్మాన్ని ప్రశ్నించే వారిపై బురద చల్లడం ద్వారా స్వాముల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది. తన కనుసన్నల్లో ఉండే కొంత మంది ఊరూ పేరు లేని స్వాముల్ని ముఠాగా ఏర్పాటు చేసి వారితో ప్రెస్మీట్లు పెట్టిస్తారు భూమన. తానే కేటాయించిన ముంతాజ్ హోటల్ స్థలంపై ఈ స్వాములతోనే దీక్షలు కూడా చేయించారు. వారు కల్తీ నెయ్యిపై మాట్లాడటం లేదు. కానీ ఇతర స్వామీజీలు మాట్లాడితే మాత్రం వారిపై ఆరోపణలు చేస్తున్నారు.
రాజకీయం కోసం ఏకంగా కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని, ఆచారాలను వివాదాల్లోకి నెట్టడం వైసీపీ ప్రతికూలంగా మారుతోంది. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాల్సింది పోయి, బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం వల్ల ప్రజల్లో ఆ పార్టీ పట్ల ఉన్న విశ్వసనీయత దెబ్బతింటోంది. తప్పు మీద తప్పు చేస్తూ పవిత్ర క్షేత్రంపై బురద చల్లడం మానుకోకపోతే భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదని ధార్మిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి.


