కొత్తగా మతం మారిన వారికి నామాలెక్కువ అన్నట్లుగా వైసీపీ నేతల ప్రవర్తన ఉంది. ఇప్పుడు వైసీపీ నేతలంతా తమకు ఎక్కడా లేనంత భక్తి ఉందని ఆలయాలు తిరుగుతున్నారు. శ్రీవారిని దర్శించుకుంటున్నారు. మీడియాతో మాట్లాడేటప్పుడు వెంకటస్వర స్వామి ఫోటోలు కనబడేలా పెట్టుకుంటున్నారు. లడ్డు కల్తీ వయవహారంలో వైసీపీ హిందువుల దృష్టిలో నేరం చేసిన పార్టీగా నిలబడిపోయింది. ఇప్పుడు దాన్ని తప్పించుకునేందుకు దేవుళ్లంటే తమకు చాలా భక్తి అని చెప్పుకునేందుకు ఈ డ్రామాలేస్తున్నారు.
దేవుడంటే ఇంత భక్తి ఉందా?
తిరుమల లడ్డూ కల్తీ వివాదం, శ్రీవారి ప్రసాదం అపవిత్రమైందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాక, వైసీపీ నేతల్లో ఒక్కసారిగా భక్తి భావం ఉప్పొంగిపోతోంది. నిన్నటి దాకా దేవుడి కంటే తమ నాయకుడి ఫోటోలకే ప్రాధాన్యత ఇచ్చిన నేతలు, ఇప్పుడు మీడియా ముందుకు వస్తే చాలు.. వెనుక వెంకటేశ్వర స్వామి ఫోటోలు స్పష్టంగా కనిపించేలా జాగ్రత్త పడుతున్నారు. ఈ హఠాత్తు మార్పు వెనుక ఉన్న అసలు కారణం ప్రజలకు తెలియంది కాదు.
హిందూ వ్యతిరేక ముద్ర నుంచి తప్పించుకునే తాపత్రయం
లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఈ హిందూ వ్యతిరేక ముద్రను ఎలాగైనా తుడిచేసుకోవాలని ఆ పార్టీ నేతలు ఇప్పుడు తాపత్రయపడుతున్నారు. అందుకే సామూహిక ఆలయ సందర్శనలు, మెట్ల దారిలో నడక ప్రయాణాలు, అఖండ నామ సంకీర్తనలు అంటూ నానా హడావిడి చేస్తున్నారు. శ్రీవారిని దర్శించుకోవడానికి క్యూ కడుతూ.. “మేము ఎంతటి భక్తులమో చూడండి అని కెమెరాల ముందు ప్రదర్శనలు ఇస్తున్నారు. అయితే ఈ భక్తి డ్రామాలు వెనుక కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం తప్ప, నిజమైన పశ్చాత్తాపం లేదని సామాన్య భక్తులకు సులువుగానే అర్థమవుతోంది.
డ్రామాలు వర్సెస్ వాస్తవాలు
వైసీపీ హయాంలో టీటీడీ బోర్డు నియామకాలు మొదలుకుని, లడ్డూ తయారీలో వాడే నెయ్యి నాణ్యత వరకు జరిగిన విచారణలు ఆ పార్టీని ఇరకాటంలో పడేశాయి. ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎంతగా భక్తి వేషాలు వేసినా, భక్తుల నుంచి వస్తున్న స్పందన మాత్రం భిన్నంగా ఉంది. ముఖ్యంగా జగన్ గారు డిక్లరేషన్ ఇవ్వకుండానే స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్లడం, ఆ తర్వాత తలెత్తిన వివాదాలు.. ఆ పార్టీకి మరింత డ్యామేజ్ చేశాయి. తప్పు చేశామన్న భయం ఉన్నప్పుడే మనిషి దేవుడి ముందు ఇన్ని ప్రదర్శనలు చేస్తాడనేది నెటిజన్ల మాట.
అధికారంలో ఉన్నప్పుడు దేవుడి ఆస్తులు, ఆచారాల పట్ల నిర్లక్ష్యంగా ఉండి.. ఇప్పుడు అధికారం పోయాక, ప్రజల్లో గౌరవం తగ్గాక భక్తి ముసుగు వేసుకోవడం వల్ల ఒరిగేదేమీ ఉంటుంది. దేవుడు అంతా చూస్తున్నాడు అని చెప్పే వైసీపీ నేతలు.. ప్రజలు కూడా అంతా గమనిస్తున్నారని మరచిపోతే, మున్ముందు ఆ పార్టీకి రాజకీయంగా మరిన్ని కష్టాలు తప్పవు.
